పిల్లలు రాత్రి నిద్రలో అకస్మాత్తుగా మాట్లాడటం ప్రారంభిస్తే.. పేరెంట్స్ లో చాలా మందికి ఇది అసాధారణంగా అనిపించవచ్చు. ఇది ఏదైనా సమస్యకు సంకేతమా..? అనే డౌట్ రావడం సహజం. కానీ నిజానికి పిల్లలు నిద్రలో మాట్లాడటం ఓ నార్మల్ నిద్ర సంబంధిత లక్షణం. ఇది చాలా సందర్భాల్లో ప్రమాదకరమైనది కాదు.
నిద్రలో మాట్లాడటం సాధారణమేనా..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలు నిద్రలో మాట్లాడటం అనేది చాలా మందిలో కనిపించే ఒక సాధారణ నిద్ర అలవాటు. పిల్లలు నిద్రలో ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా తెలియకపోయినా.. వారి మాటలను మనం గమనించగలుగుతాం. ఒక్కోసారి వారు భయపడినట్లు లేదా కలల్లో ఎవరికైనా ప్రతిస్పందిస్తున్నట్లు ఉండవచ్చు. ఇది సాధారణంగా ఆందోళన కలిగించే విషయం కాదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మానసిక ఒత్తిడి
పిల్లలు పెద్దల మాదిరిగానే భావోద్వేగాలను అనుభవిస్తారు. పరీక్షల ఒత్తిడి, కుటుంబ విభేదాలు లేదా ట్రిప్‌లు వంటి ఉత్సాహకరమైన సంఘటనలు కూడా వారిపై ప్రభావం చూపుతాయి. ఈ విధంగా వారి మనసులో చెలరేగే ఆలోచనలు నిద్రలో మాటలుగా బయటపడవచ్చు.
శారీరక అనారోగ్యం
జ్వరం, తలనొప్పి వంటి అనారోగ్యాల సమయంలో శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోదు. అటువంటి సందర్భాల్లో నిద్రలో మాట్లాడే అవకాశాలు పెరుగుతాయి.
అస్థిరమైన నిద్ర అలవాట్లు
పిల్లలు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించకపోతే శరీరంలోని బయోలాజికల్ క్లాక్ గందరగోళానికి గురై నిద్రలో అంతరాయాలతో మాట్లాడటం జరుగుతుంది.
కుటుంబ వారసత్వం
మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇటువంటి అలవాటు కలిగి ఉంటే.. ఇది వారసత్వంగా కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఉంది.
తల్లిదండ్రులుగా ఏం చేయాలి..?
పిల్లలు అప్పుడప్పుడు నిద్రలో మాట్లాడితే ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఇది పదే పదే జరుగుతుంటే.. శబ్దాలు గట్టిగా, భయంగా వినిపిస్తుంటే లేదా కలలు, నిద్రలో నడవడం వంటి ఇతర సమస్యలతో కలిసి వస్తుంటే తప్పకుండా శ్రద్ధ పెట్టాలి. అలాంటి సందర్భాల్లో ముందుగా పిల్లల వైద్యుడిని సంప్రదించండి. అవసరమైతే మానసిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది. పిల్లల నిద్రను మెరుగుపరచేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రకు సరైన సమయం
ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకునే అలవాటు వారిలో నిద్ర గమనాన్ని స్థిరంగా ఉంచుతుంది. నిద్రించే గది నిశ్శబ్దంగా, వెలుతురు లేకుండా ఉండేలా చూసుకోండి.
నాణ్యమైన నిద్ర
పిల్లలు రోజుకు కనీసం 8 నుంచి 9 గంటల నిద్ర పొందేలా చూసుకోండి. పడుకునే ముందు టాయిలెట్‌కు పంపించడం ద్వారా నిద్ర మధ్యలో అంతరాయం కలిగే అవకాశాన్ని తగ్గించవచ్చు.
నిద్రకు ముందు గొడవలు వద్దు
పిల్లలు పడుకునే ముందు వారిని ఇబ్బంది పెట్టే పనులను ఆపండి. ఉదాహరణకు గట్టిగా అరిచినా లేదా గొడవలు పడినా వారి మనసు పాడవుతుంది.
ఆహార నియమాలు
రాత్రివేళల్లో కాఫీ, టీ లేదా షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఇవ్వడం వల్ల శరీరంలో శక్తి పెరిగి నిద్రలో అంతరాయం కలుగుతుంది. వీటిని నివారించండి.
పిల్లలు నిద్రలో మాట్లాడటం అనేది ఎక్కువగా శారీరక లేదా మానసిక ఒత్తిడి ప్రభావమే. ఇది చాలా సందర్భాల్లో తాత్కాలికమే. మీరు పిల్లల నిద్ర అలవాట్లను మెరుగుపరిస్తే ఈ సమస్య కూడా తగ్గిపోతుంది. కానీ ఏదైనా సమస్య తరచుగా కనిపిస్తే.. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)