
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డుల జారీ చేయనున్నారు. దీంతో తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 95.56లక్షలకు చేరనుంది. ఈ కొత్త రేషన్ కార్డులతో 11.3 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
తుంగతుర్తి సభలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గోదావరి జలాలు తుంగతుర్తికి తీసుకురాలేదని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని.. దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తేవడం మాటలు చెప్పినంత సులువు కాదని తన పర్యటనను అడ్డుకుంటామన్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
గతంలో 3 రోజులు అవకాశమిస్తే తుంగతుర్తికి జలాలు తెస్తామన్నారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా దేవాదుల నుంచి నీళ్లు తేలేదని విమర్శించారు. నాడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే ఇప్పుడు నల్లగొండ జిల్లాకు నీళ్లు అందిస్తున్నాయన్నారు. కానీ లక్ష కోట్ల పెట్టి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరమయ్యిందిని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన శ్రీశైలం, సాగర్ ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సాగర్ కట్టమీద చర్చిద్దామా? అంటూ బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాళేశ్వరం కూల్చిన కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేసినా తప్పు లేదని సీఎం రేవంత్ మండిపడ్డారు.
పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పేదలకు కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదన్నారు. కొత్త రేషన్ కార్డులు కల్పించి లక్షలాది మంది పేదలకు సన్న బియ్యం ఇస్తుంటే ఇప్పుడు ఓర్వలేకపోతున్నారుని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొడుతుందని తప్పుడు ప్రచారం చేసి బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. కానీ 9 రోజుల్లోనే రైతులకు రైతు భరోసా నగదు అందించామని సీఎం చెప్పుకొచ్చారు. వరి ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణను దేశంలో నంబర్‌వన్‌గా నిలిపామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.