ఒడిశాలో ప్రేమ వివాహం చేసుకున్న జంటలపై అమానవీయ ఘటనలు కొనసాగుతున్నాయి. రాయగడ జిల్లాలో ఇటీవల జరిగిన ఒక ఘటన ఇంకా మరువక ముందే, కోరాపుట్ జిల్లాలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నారాయణపట్టణం సమితి బైరాగి పంచాయతీ పరిధిలోని పెద్దఇటికీ గ్రామంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఆంధ్రా ఒడిశా బోర్డర్ రాయగడ జిల్లాలో జరిగిన అమానవీయ ఘటన పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాయగడ జిల్లా నారాయణపట్నం సమితి ఇటికి గ్రామంలో ఒక యువకుడు, యువతి ప్రేమించుకుని ఐదు సంవత్సరాల క్రితం గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. వారు పెళ్లి చేసుకొని జీవనం సాగిస్తుండగా కుటుంబ సభ్యులు గ్రామంలో అందరి సమక్షంలో మళ్లీ వివాహం చేస్తామని నమ్మించి వారిని తిరిగి పిలిపించారు.
అయితే, యువకుడు, యువతి ఇద్దరు వరుసకు అన్నాచెల్లెళ్లు కావడంతో గ్రామ పెద్దలు ఆ వివాహాన్ని అంగీకరించలేదు. ఒకే వంశంలో ఒకే కులం లేదా ఒకే గోత్రంలో వివాహం చేసుకోవడం గ్రామ ఆచారాలకు విరుద్ధమని, ఇది అపచారమని గ్రామపెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ పెద్దల నిర్ణయం ప్రకారం వారు వేసే శిక్ష అనుభవించి గ్రామాన్ని శుద్ధి చేసిన తరువాత మాత్రమే వివాహం చేసుకోవాలని హుకుం జారీ చేశారు. ఆ శిక్ష లో భాగంగా ఆ జంటను నాగలికి ఎద్దుల్లాగా కట్టి, కర్రలతో కొడుతూ గ్రామ రహదారిలో, పొలంలో దున్నించారు.
వీడియో చూడండి..
ఈ చర్యలు గ్రామ ఆచారం ప్రకారం శుద్ధి అనే కార్యక్రమంలో భాగంగా జరిగాయని పెద్దలు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జరిగిన అమానవీయ ఘటన పై నెటిజన్లు, మానవతావాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ఈ ఘటన పై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
రాయగడ జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనల పై జిల్లావాసులు మండిపడుతున్నారు. సమాజంలో కొనసాగుతున్న పాత ఆచారాలు, మూఢాచారాలను లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అంటున్నారు. అధికారులు ఈ ఘటనలను సీరియస్గా పరిగణించి, బాధితులకు న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.