
గురుపౌర్ణిమ సందర్భంగా షిర్డీ సాయిబాబా ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి 3 లక్షలకుపైగా బాబా భక్తులు తరలివచ్చారు. అపారమైన భక్తితో భారీగా విరాళాలు సమర్పించారు. దేవస్థానానికి డబ్బు రూపంలో, ఆభరణాల రూపంలో, అలాగే ఆన్‌లైన్ ద్వారా విరాళాలు ఇచ్చారు. మొత్తం మూడు రోజుల్లో భక్తులు రూ. 6 కోట్ల 31 లక్షల 31 వేల 362 రూపాయల విలువైన గురుదక్షిణను బాబాకు సమర్పించారని సాయి సంస్థాన్ సీఈవో గోరక్ష్ గాడీల్కర్ తెలిపారు. హుండీ ద్వారా రూ.1.88 కోట్లు, నగదు కౌంటర్ల ద్వారా రూ.1.17 కోట్లు, ప్రత్యేక పాసుల ద్వారా రూ. 55.88 లక్షలు, ఆన్‌లైన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు, మనీ ఆర్డర్ల ద్వారా రూ. 2.05 కోట్లు వచ్చాయని సీఈవో తెలిపారు.
అంతేకాకుండా భక్తులు రూ. 57.87 లక్షల విలువైన 668 గ్రాముల బంగారం, రూ. 5.85 లక్షల విలువైన 800 గ్రాముల వెండి ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. ఈ విరాళాలు కేవలం డబ్బుగా కాకుండా భక్తుల విశ్వాసాన్ని ప్రతిబింబించేవిగా ఉన్నాయని సీఈవో గాడీల్కర్ అన్నారు. ఈ మొత్తం డబ్బును వివిధ సామాజిక అవసరాలకు, ఆరోగ్య రంగం, విద్యా రంగంలో వినియోగిస్తామని చెప్పారు. అంతేకాకుండా గురుపౌర్ణిమ రోజు ఓ దాత ఏకంగా రూ. 63 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఆలయానికి సమర్పించారు. ఇందులో ముఖ్యంగా 566 గ్రాముల బరువున్న బంగారు కిరీటం ఉంది. దాని విలువ రూ. 59 లక్షలు ఉంటుందని, అలాగే రెండు కిలోల వెండి హారం, 50 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న బంగారు పువ్వులు ఈ విరాళంలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
1908 నుంచి షిర్డీ ఆలయంలో గురుపౌర్ణిమను ఘనంగా జరుపుతున్నారు. సాయిబాబా భక్తులు పెద్ద ఎత్తున షిర్డీ చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఈ సంవత్సరం కూడా దేశనలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చిన భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా జర్మనీ, కొలంబియా, శ్రీలంక వంటి దేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేలాది మంది వాలంటీర్లు సేవలందించారు. నగరవ్యాప్తంగా స్వచ్ఛత, పారిశుద్ధ్యం, వైద్య సౌకర్యాలను మెరుగ్గా అందించారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బలగాలను నియమించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.