కూరగాయలు కొన్నారా? ఫోన్ పట్టు పేమెంట్ కొట్టు. కిరాణా షాపులో సరుకులు కొన్నారా? మళ్లీ ఫోన్ పే. టీ తాగారా మళ్లీ జీ పే. ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేశారా? ఇదిగో జీ పేమెంట్. యస్. ఇప్పుడు డిజిటల్ ఇండియా యుగం నడుస్తోంది. అంతా ఆన్‌లైన్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఎంతైనా కొను. ఏదైనా కొను. ఆన్‌లైన్‌లో చెల్లించెయ్. జేబులో నుంచి ఫోన్ తీసి, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి టకటకా పేమెంట్స్ చేసేస్తున్నారు జనం. అంతా UPI పేమెంట్స్ కాలం నడుస్తోంది.
గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే, భీమ్ పే…ఇలా లక్షా తొంభై ఆరు ఆన్‌లైన్ పేమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక్క ఫోన్…వంద UPI ఆప్షన్స్ ఉన్నాయి. సో…జనం షాపింగ్ చెయ్యడానికి పర్సుల్లో, బ్యాగుల్లో క్యాష్ మోసుకెళ్లనక్కర్లేదు. లక్ష రూపాయల వరకు UPI పేమెంట్…స్పాట్‌లో చేసెయ్యచ్చు. అదే ఎమర్జన్సీ హాస్పిటల్ సర్వీస్ అయితే, ఆ లిమిట్ 5 లక్షల రూపాయల వరకు పెంచారు.
బెంగళూరులో నో యూపీఐ ట్రెండ్
ఇండియన్ సిలికాన్ వ్యాలీ, ఐటీ కేపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరులో కూడా నిన్నటివరకు ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చిన్నాచితకా వ్యాపారాలు చేసేవాళ్లు UPI పేమెంట్స్ తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తమ దుకాణాలు ముందు నో యూపీఐ అంటూ బోర్డులు పెడుతున్నారు. క్యూ ఆర్ స్కాన్ కోడ్‌లు కనపడకుండా చేస్తున్నారు. క్యాష్ కొట్టు సరుకులు, సేవలు పట్టు అంటున్నారు.
చిన్న వ్యాపారులకు GST నోటీసులు
దీనికి కారణం లేకపోలేదు. బెంగళూరులో రోడ్ల పక్కన బళ్లు, దుకాణాలు నడుపుకునేవారు, చిన్నచిన్న వ్యాపారాలు చేసేవాళ్లకు…ఈమధ్య రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ జారీ చేసిన GST నోటీసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఏడాదికి 40 లక్షల రూపాయల వరకు సరుకులు అమ్మితే వాళ్లు కంపల్సరీగా GST రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక ఏడాదికి 20 లక్షల రూపాయల సేవలు అందించినవాళ్లు కూడా GST కేటగిరీలోకి వస్తారు. ఇక జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా యూపీఐ ద్వారా సంవత్సరానికి రూ.40 లక్షలకుపైగా లావాదేవీలు చేసిన 14,000 మంది వ్యాపారులను బెంగళూరు అధికారులు గుర్తించారు. వీరిలో 5,500 మందికి మొదటి దశలో నోటీసులు జారీ చేశారు. యూపీఐ ద్వారా సంవత్సరానికి రూ. 40 లక్షలకు పైగా లావాదేవీలు జరిపిన వ్యాపారులు జీఎస్టీ చెల్లించకుండా తప్పించుకుంటున్నారంటూ కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ ఈ చర్యలు ప్రారంభించింది.
బెంగళూరులో యూపీఐ పేమెంట్స్‌కు బ్రేక్
ఈ నోటీసులతో బెంబేలెత్తుతున్న వ్యాపారులు, తమ దుకాణాల నుంచి…యూపీఐ QR కోడ్ స్టిక్కర్లు తీసేయడం ప్రారంభించారు. యూపీఐ పేమెంట్స్‌ను స్వీకరించబోమని కస్టమర్లకు తేల్చి చెబుతున్నారు. మొన్నటివరకు ఉన్న క్యూఆర్ కోడ్‌లను తొలగించి వాటి స్థానంలో నో యూపీఐ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ అని రాసిన బోర్డులను పెడుతున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న బెంగళూరులో…ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ హవాకు బ్రేక్ పడింది. ఈ ధోరణి కొనసాగితే, యూపీఐ పేమెంట్స్‌కు ఇది పెద్ద ఇబ్బంది అవుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు.