దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పలు పోస్టాఫీసులు మూడు రోజులపాటు తాత్కాలికంగా మూతపడనున్నాయి. డిజిటల్ ఎక్సలెన్స్‌లో భాగంగా నెక్ట్స్ జనరేషన్ ఏపీటీ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తపాలా శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా తిరుపతి డివిజన్ లోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ నెల 22న అప్ గ్రేడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ అధునాతన డిజిటల్ ప్లాట్ఫామ్‌కు అవాంతరాలు లేకుండా సురక్షితంగా మారడానికి వీలుగా జూలై 19 నుండి 21 వరకు ప్రణాళికాబద్ధమైన డౌన్‌టైమ్ అమలు చేస్తున్నారు.
దీంతో ఆయా రోజుల్లో పోస్టాఫీసులలో ఎటువంటి ప్రజా లావాదేవీలు జరగవని పోస్టాఫీసుల సీనియర్ సూపరింటెండెంట్ మేజర్ సయిదా తన్వీర్ ఒక ప్రకటనలో తెలిపారు. డేటా మైగ్రేషన్, సిస్టమ్ ధృవీకరణలు, కాన్ఫిగరేషన్ ప్రక్రియలను సులభతరం చేయడానికి, కొత్త సిస్టమ్ సజావుగా, సమర్థవంతంగా లైవ్ లోకి వెళ్లేలా చూసుకోవడానికి సేవల తాత్కాలిక నిలిపివేత అవసరమని వివరించారు.
మెరుగైన వినియోగదారు అనుభవం, వేగవంతమైన సర్వీస్ డెలివరీ, మరింత కస్టమర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్‌ను అందించడానికి ఏపీటీ అప్లికేషన్‌ను రూపొందించారు. నెక్ట్స్ జనరేషన్ ఏపీటీ అప్లికేషన్ అమలులో భాగంగా జూలై 21న తెలంగాణలోని రంగారెడ్డి, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాలు మినహా అన్ని పోస్టాఫీసుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (టెక్-ఆపరేషన్స్) నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి