కొన్ని ప్రేమలు జీవితాలను సుసంపన్నం చేస్తే.. మరికొన్ని ప్రేమకథలు విషాదాన్ని మిగులుస్తాయి. అలాంటి ఓ కథ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఓ యువకుడి పరువు హత్య కలకలం రేపింది. తన కూతురిపై వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ తండ్రి, మరో ఇద్దరితో కలిసి యువకుడిని దారుణంగా చంపాడు.. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్‌లో చోటుచేసుకుంది.. అందరూ చూస్తుండగానే.. యువకుడిపై దాడి చేయడం.. ఆ తర్వాత హత్య చేయడంతో.. మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ పరువు హత్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం..
కిషన్ రావు పేటకు చెందిన 26 ఏళ్ల సల్లూరి మల్లేశ్ కొన్నేళ్లుగా ఇదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. వెంటపడటం మొదలెట్టాడు.. అయితే.. యువతి తల్లిదండ్రులు మల్లేష్ ను పలుమార్లు హెచ్చరించారు. మల్లేశ్ ప్రేమ వ్యవహారంపై.. సదరు యువతి కూడా పలుమార్లు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మల్లేశ్ పై నాలుగు కేసులు కూడా నమోదయ్యాయి. ఇదే విషయంలో మూడేళ్ల క్రితం కూడా మల్లేశ్ పై యువతి కుటుంబీకులు దాడికి పాల్పడ్డారు. మల్లేశ్ ఫిర్యాదు మేరకు యువతి తండ్రి రాజిరెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.
ఈ క్రమంలోనే.. మల్లేష్ యువతి ఇంటికి వెళ్లాడు.. దీంతో యువతి ఆమె తండ్రికి సమాచారం ఇచ్చింది.. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు తండ్రి రాజిరెడ్డి, మరో ఇద్దరితో కలిసి వెల్గటూర్ పెద్దవాగు వంతెన సమీపంలో కాపు కాశాడు. స్థానికులు చూస్తుండగానే దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నిందితులంతా అక్కడినుంచి పారిపోయారు.. కాసేపటికే.. కిలోమీటర్ దూరంలో ఉన్న పాత వైన్స్ షాప్ వెనుక.. మల్లేశ్ కత్తిపోట్లకు గురై విగతజీవిగా పడి కనిపించాడు..
కూతురికి పెళ్లి సెటిలైన క్రమంలో మల్లేశ్ ఇంకా కూడా వెంటపడుతుండటంతో భరించలేకే తండ్రి రాజిరెడ్డి అతన్ని చంపినట్లు పేర్కొంటున్నారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.. మల్లేశ్ తండ్రి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు రాజిరెడ్డితో పాటు, మరో ఇద్దరిపై పోలీసులు హత్యా కేసు నమోదు చేశారు. మల్లేశ్ ది పరువు హత్యే.. అని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..