ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. శుక్రవారం బీహార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీహార్ ఎన్నికలకు సన్నద్దం అవుతున్న తరుణంలో జరిగిన ఈ ప్రమాదం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది.
శుక్రారం అరా సిటీలో సభకు హాజరయ్యారు ప్రశాంత్ కిషోర్. సభ అనంతరం నడుస్తూ వెళ్లి జనంతో మాట్లాడుతుండగా ఒక గుర్తుతెలియని వాహనం ఆయనను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన పక్కటెముకలకు గాయాలయ్యాయి. దాంతో, ప్రశాంత్‌ను హుటాహుటిన పాట్నాలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పడంతో పార్టీ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.
ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ 2024 అక్టోబర్ 2న సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. త్వరలో జరుగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 243 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. పార్టీ తన జాతీయ కార్యనిర్వాహక కమిటీ తొలి సమావేశాన్ని పాట్నాలో నిర్వహించినందున దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులను దశలవారీగా, నాలుగు నుండి ఐదు రౌండ్లలో ప్రకటించాలని నిర్ణయించారు. పార్టీ మొదట 40 రిజర్వ్డ్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తుంది.
అయితే.. ప్రశాంత్ పార్టీ రంగంలోకి దిగడంతో ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోరు ఆసక్తిగా ఉండనుంది. జేడీ (యూ), బీజేపీ కూటమి, మహాగట్‌బంధన్ పార్టీలతో జన్ సురాజ్ ఏ మేరకు పోటీ ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.