సాఫ్ట్ వేర్ రంగంలో అత్యాధునిక మార్పులు వస్తున్నట్లే వ్యవసాయ రంగం కూడా కొత్త పుంతలు తొక్కి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచం మొత్తం కూడా ఏఐ చుట్టూ తిరుగుతుంది. రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత వ్యవసాయం మనం చూడబోతున్నాం. పొలంలో నేల నాణ్యతను, పంట ఎదుగుదలను, చీడపీడల ఉనికిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) స్కాన్ చేస్తుంది. ఎలాంటి పురుగు మందులను, ఎరువులను ఎక్కడ. ఎంత పరిమాణంలో పిచికారీ చేయాలో సూచిస్తుంది. పంటలలో కలుపు మొక్కలను మెషిన్ లెర్నింగ్ గుర్తిస్తుంది. ఆకుల పరిమాణం, ఆకారం, రంగును కంప్యూటర్ విజన్ గుర్తించాక రోబోలు వచ్చి కలుపుతీస్తాయి. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. పంటలకు ఏ సమయంలో ఎంత స్థాయిలో నీటిని అందించాలో ఐవోటీ సెన్సర్లు చూసుకుంటాయి.
పంట చివరి దశకు వచ్చిన విషయాన్ని కూడా ఏఐ గుర్తించి. రోబోలకు ఆదేశమిచ్చి డిజిటల్ ఆటోమేషన్ ద్వారా కోతలను పూర్తిచేస్తుంది. చివరగా దిగుబడుల ఆకారం, రంగు, పరిమాణం ఆధారంగా గ్రేడింగ్ ఇస్తుంది. మార్కెటింగ్ అవకాశాలనూ సూచిస్తుంది. ఇదంతా ఎక్కడో… అమెరికా, ఇజ్రాయెల్, జర్మనీ వంటి దేశాల పొలాల్లో జరిగే అధునాతన వ్యవసాయం గురించి అనుకుంటున్నారా.. కాదు మన తెలంగాణ లోనూ డిజిటల్ వ్యవసాయంకు కసరత్తు మొదలైంది.
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి మానవ రహిత వ్యవసాయం సాదించడమే లక్ష్యంగా హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆధునాతన ప్రయోగశాల ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో తొలిసారిగా నెలకొల్పుతున్న ఈ ప్రయోగశాలకు ఎస్బీఐ 15 కోట్లు సమకూరుస్తోంది. దీన్ని ఎస్బీఐ ఏఐ, రోబోటిక్స్, ఐవోటీ పండర్ స్మార్ట్ అగ్రికల్చర్ ల్యాబ్ (ఎస్బీఐ ఏఆర్ఐ ఎస్ఏ)గా పిలవనున్నారు.
వ్యవసాయ వర్సిటీ పరిధిలోని డిజిటల్ వ్యవసాయ కేంద్రంలో ఒక ఎకరం స్థలంలో ఏర్పాటు చేస్తున్న ల్యాబ్ మరి కొద్ది రోజుల్లో పూర్తిగా అందుబాటులోకి రానుంది. పరిశోధన, ఆవిష్కరణ, శిక్షణ పర్యావరణ వ్యవస్థలను వ్యవస్థీకృతం చేసి. కార్యాచరణ కేంద్రిత డేటా మేనేజ్ మెంట్ ప్లాట్‌ఫామ్ ద్వారా సేద్యంలో ఉత్తమ పద్ధతులను ల్యాబ్ ద్వారా ప్రోత్సహిస్తారు. రైతులు, విద్యార్థులు, పరిశోధకులు, ఆవిష్కర్తల కోసం నైపుణ్య అభివృద్ధి కేంద్రం. ఏఐ, డ్రోన్, రోబో టిక్స్, మెకాట్రానిక్స్ పై అధునాతన ప్రయోగశాలలు, లైవ్ డెమో కేంద్రం, ఇతర ఆటోమేటెడ్ ఫార్మ్ మెషినరీ తయారీ-విస్తరణ కేంద్రం, డ్రోన్ అకాడమీ, అగ్రి ఫొటో వోల్టాయిక్, స్మార్ట్ అగ్రికల్చర్, యంత్ర సాగు కేంద్రం వంటి సౌకర్యాలను సమకూరుస్తున్నారు.
పరిశోధనశాల వేదికగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు డిజిటల్ అగ్రికల్చర్లో ఇంటర్న్‌షిప్ ఇస్తారు. ఎమ్మెస్సీ, ఎంటెక్ విద్యార్థులు సంప్రదాయ పరిశోధనలు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. గ్రామీణ యువతకు నైపుణ్య కార్యక్రమాలు. రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్ పిలానీతోపాటు అగ్రివర్సిటీలోని ఆగ్రిహబ్ ఇంక్యుబేషన్లో ఉన్న అంకుర సంస్థల సహకారం తీసుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగానూ ఏఐ ప్రయోగశాల ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య శాఖల సమన్వయంతో వర్క్‌షాపులు నిర్వహిస్తారు..
తెలంగాణను డిజిటల్ వ్యవసాయ రాష్ట్రంగా మార్చేందుకు, అన్నదాతలకు ఉన్నత సాంకేతికతను అందుబాటులో తెచ్చేందుకు అధునాతన ప్రయోగశాల దోహదపడుతుంది. 2047 సంవత్సరాని కల్లా రైతు రహిత వ్యవసాయం అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.. పూర్తిగా పంట వేసిన దగ్గర నుండి పంటను మార్కెట్ కి తరలించే వరకు కూడా రోబో, డ్రోన్స్ తోనే పంటలు పండించే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం ల్యాబ్‌లో పరిశోధనలు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.