ఈ నెల(జులై) 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు వృషభ రాశిలో శుక్ర, చంద్రుల యుతి జరుగుతోంది. ఈ రాశి చంద్రుడికి ఉచ్ఛ క్షేత్రం కాగా, శుక్రుడికి స్వక్షేత్రం. సుఖ సంతోషాలకు, విలాసా లకు, శృంగార జీవితానికి, ప్రేమలకు, పెళ్లిళ్లకు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు మనస్సుకు కారకుడైన చంద్రుడితో కలవడం వల్ల కొన్ని రాశుల వారికి మనసులోని కోరికలు తీరే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందడం, కెరీర్ పరంగా అనుకూలతలు పెరగడం, ప్రేమల్లో విజయాలు సాధించడం, వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవడం వంటివి జరుగుతాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులవారు ఈ శుభ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది.
- మేషం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో శుక్ర, చంద్రుల కలయిక వల్ల కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి, అనుకూలతలు, అన్యోన్యతలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలకు ప్లాన్ చేయడం జరుగుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.
- వృషభం: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడితో ఉచ్ఛ చంద్రుడు కలవడం వల్ల జనాకర్షణ బాగా పెరుగుతుంది. సినిమా, టీవీ రంగాలకు చెందిన కళాకారులతో పాటు ఇతర కళాకారులకు కూడా దశ తిరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ప్రేమ, పెళ్లి విషయాల్లో విజయాలు సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి ఉచ్ఛపట్టడంతో పాటు, లాభాధిపతి శుక్రుడితో యుతి చెందడం వల్ల మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల లాభాల పంట పండుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.
- కన్య: భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శుక్రుడితో లాభాధిపతి చంద్రుడు కలవడం వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, మదుపులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో సప్తమాధిపతి శుక్రుడితో భాగ్యాధిపతి చంద్రుడు యుతి చెందడం వల్ల సినిమా, టీవీ, తదితర కళాకారులకు ఉచ్ఛ దశ ప్రారంభమవుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. విదేశీ ఆఫర్లు అందుతాయి.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో పంచమాధిపతి శుక్రుడితో సప్తమాధిపతి చంద్రుడు కలవడం వల్ల ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభించడంతోపాటు పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆర్థికంగా ఊహించని అభివృద్ధి ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.