బెంగళూరు, అక్టోబర్ 22: కర్ణాటక రాజధాని బెంగళూరులో భరీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల ధాటికి నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం ఒకటి మంగళవారం (అక్టోబర్ 22) కుప్పకూలింది. భవనంలో కూలీలు పనిచేస్తుండగానే ఒక్కసారిగా కూలింది. దీంతో పలువురు కూలీలు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. కనీసం 20 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. బెంగళూరులోని హొరమావు అగార ఏరియాలో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
భవనం కుప్పకూలిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం 4.10 గంటలకు కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేసినట్లు అగ్నిమాపక, ఎమర్జెన్సీ సర్వీస్ వర్గాలు తెలిపాయి. వెంటనే బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. హెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజనాద్రి లేఅవుట్లో ఉన్న ఆరు అంతస్తుల భవనం శిథిలాల నుంచి ఇప్పటివరకు 14 మందిని రక్షించినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి. ఒకరు మృతి చెందగా..14 మందిని నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే మూడు ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి పంపించామని తెలిపారు. ప్రస్తుతం శిథిలాల తొలగించి బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అన్నారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి
#WATCH | Karnataka: Rescue operation underway after an under-construction building collapsed in the Horamavu Agara area in the eastern part of Bengaluru. pic.twitter.com/PaDbYIK0FR
— ANI (@ANI) October 22, 2024
అందిన సమాచారం మేరకు అధికారులు ఆన్సైట్లో ఉన్నారు. చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించడానికి సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. భవనం మొత్తం కూలిపోయిందని, దీనితోకూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. సుమారు 20 మంది చిక్కుకుపోయారు. ఒక మృతదేహాన్ని వెలికితీశాం. 14 మంది కార్మికులను రక్షించి ఆస్పత్రులకు తరలించాం. ఐదుగురి ఆచూకీ ఇంకా కనిపించలేదని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు బెంగళూరు) డి దేవరాజు మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.