చాలా మందికి అల్పాహారంగా ఓట్స్ లేదా కార్న్‌ఫ్లేక్స్ తినడం అలవాటు. కాబట్టి వీరికి తప్పనిసరిగా పాలు అవసరం. ఇంట్లో పిల్లలు ఉంటే ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తప్పకుండా ఇవ్వాలి. అలాగే చాలా మందికి రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలు తాగే అలవాటు ఉంటుంది. కొందరైతే కొద్దిగా పసుపు కలిపి పాలు తాగుతుంటారు.
రోజూ పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తక్కువేమీ కాదు. శరీరంలో కాల్షియం లోపాన్ని పూరించడానికి పాలు సహాయపడుతుంది. పాలలో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ డి వంటి వివిధ క్రియాశీల పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. నిత్యం పాలు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రోగాలు త్వరగా నయం కావాలంటే పాలు తాగడం మంచిది. పాలలో ఉండే అనేక ప్రయోజనకరమైన పదార్థాలు దంతాలు, ఎముకల సంరక్షణలో సహాయపడతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పాలు కూడా చాలా ముఖ్యం.
అయితే చాలా మంది ప్యాకెట్ పాలు వాడుతుంటారు. మార్కెట్ నుండి కొనుగోలు చేసిన ప్యాకేజ్డ్ పాలు ఆరోగ్యానికి సురక్షితమేనా? ప్యాకెట్ పాలను నేరుగా పచ్చిగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? లేదా కాచినవే తీసుకోవాలా? గతంలో ఆవులు, గేదెల నుంచి సేకరించిన పాలను వినియోగించేవారు. ప్రస్తుతం అందరూ 'టెట్రా ప్యాక్' లేదా ప్యాకెట్ పాలను వాడుతున్నారు. అన్ని చోట్లా ఈ పాలను వినియోగించే ట్రెండ్ కూడా పెరిగింది. కానీ ప్యాకెట్ పాలు పాశ్చరైజ్డ్ చేసి ఉంటాయి. పాలను స్టెరిలైజ్ చేసి నిల్వ చేసే ప్రక్రియను పాశ్చరైజేషన్ అంటారు.
పాలను 72 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 15 సెకన్ల పాటు ఉడకబెట్టడం ద్వారా ప్రత్యేక పద్ధతిలో ఎక్కువ కాలం నిల్వ చేయడానికి పాశ్చరైజ్ చేస్తారు. మార్కెట్లో స్టెరిలైజ్ చేసి ప్యాక్ చేసిన పాశ్చరైజ్డ్ పాలను కాగబెట్టకుండా పయోగించవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ స్టెరిలైట్ చేసినా మరిగించకుండా పాలను నేరుగా తీసుకోవడం సరికాదని వైద్యులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువట. కాబట్టి పాశ్చరైజేషన్ పాలను తప్పనిసరిగా కాగబెట్టి వినియోగించాలి.
మార్కెట్లో కొనుగోలు చేసిన, ప్యాక్ చేసిన పాలను నేరుగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. పైగా పాలలో E-coli, Salmonella వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. నిర్ణీత ఉష్ణోగ్రతల వద్ద పాలను మరిగించడం వల్ల ఇవి నశిస్తాయి. ఈ బాక్టీరియా శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.