అనుమానం ఆ దంపతుల పాలిట పెను భూతమైంది. భర్త వేధింపులను భరించలేని భార్య ట్రైన్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. అనేకసార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా భర్త బుద్ధి మారకపోవడంతో.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య.. తమిళనాడులో శవమై కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల్ జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిన మాధవితో వనపర్తి జిల్లా నాగల్ కడ్మూర్ గ్రామానికి చెందిన కుర్వ శివకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య, భర్తలు ఇద్దరు హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొత్తలో ఇరువురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. వీరికి ప్రస్తుతం సుమారు 11నెలల కుమారుడు ఉన్నాడు. దంపతులిద్దరూ ఉద్యోగస్థులు కావడంతో అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారానికి.. భర్త శివ అనుమానం చీడ పురుగుగా మారింది. భార్య మాధవిపై అనుమానంతో పలుసార్లు ఇరువురి మధ్య గొడవలు జరిగాయి.
ఇన్నగా మొదలైన ఈ గొడవలు కాస్తా.. పెద్దల పంచాయితీ వరకు వెళ్లాయి. అనేక మార్లు పంచాయితీలు పెట్టిన భర్త శివ బుద్ధిలో ఎలాంటి మార్పు రాకపోగా అనుమానం మరింత ఎక్కువైంది. దీంతో భార్య మాధవికి అనేక ఆంక్షల విధించాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం మాధవిని ఉద్యోగం కూడా మాన్పించాడు. ఆమె ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేయించాడు. దీంతో ఇరువురి మధ్య గొడవలు మరింత ముదిరాయి. భర్త అనుమానంతో మాధవి తీవ్ర మనస్థాపానికి గురైంది. గత ఆదివారం రోజున భర్త ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లొ నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు అక్కడ ఇక్కడ ఆరా తీసిన భర్త శివ.. చివరకు హైదరాబాద్ లోని పహడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య అదృశ్యమైనట్టు కంప్లైంట్‌లో పేర్కొన్నాడు.
హైదరాబాద్ లో మిస్సై.. తమిళనాడులో విగతజీవిగా..
ఆదివారం హైదరాబాద్‌లో అదృశ్యమైన మాధవి తమిళనాడులోని కోయంబత్తూర్ రైల్వే ట్రాక్ పై విగతజీవిగా కనిపించింది. రైల్వే ట్రాక్‌పై మాధవి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆమె ఆధార్ కార్డులోని వివరాల ద్వారా ఆమె తండ్రికి సమాచారం ఇచ్చారు. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి మాధవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అంచనా వేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక పోలీసుల సమాచారంతో ఘటనస్థలికి వెళ్లిన మాధవి తల్లిదండ్రులు, భర్త శివ అక్కడే పోస్టుమార్టం నిర్వహించి డెడ్ బాడీని అత్తగారింటికి తరలించారు. అయితే విషయం తెలుసుకున్న మాధవి కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహానికి లోనయ్యారు. భర్త శివ కుటుంబ సభ్యులపై దాడికి దిగడంతో నాగల్ కడ్మూర్ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మాధవి కుటుంబ సభ్యులను శాంతింప చేశారు. భర్త శివ వేధింపులు, చిత్రహింసలు తట్టుకోలేక మాధవి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. అనంతరం గ్రామ పెద్దలు, పోలీసుల జోక్యంతో మరణించిన మాధవి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.