Web.
అనగనగా రెండు ప్రణయపక్షులు. కేరాఫ్ మిర్యాలగూడ.. నల్గొండ జిల్లా. వాళ్ల ప్రేమ ఎంత గాఢమైనదంటే వాళ్లవాళ్ల కుటుంబ స్థితిగతులు, ఆర్థికస్తోమతలే కాదు.. కులమతాల అడ్డుగోడల్ని కూడా ఖాతరు చేయలేనంత. ఐనవాళ్ల చావుకు సైతం తెగించేటంత. ఇంతటి లోతైన ప్రేమల్లో పీకల్లోతు కూరుకుపోయిన ఆ ఇద్దరి ప్రేమ కథ అనేక మలుపులు తిరిగి.. ఇప్పటికి క్లయిమాక్స్కొచ్చేశాయి. వాళ్ల ప్రేమకు ఖరీదు కట్టి.. ఇటువంటి ప్రేమలు సమాజానికి ప్రమాదకరం అని సందేశమిచ్చారు శ్రీమాన్ కోర్టువారు.
ఔను.. రాస్తే ఇది మరో చరిత్రకు తక్కువ.. రక్తచరిత్రకు ఎక్కువ. రొటీన్‌గా సాగే రొమాంటిక్ ప్రేమ కథలకు నెక్స్ట్ లెవల్ అనుకోవచ్చు. ఎందుకంటే.. వీళ్ల ప్రేమకు చెల్లించిన భారీ మూల్యం ఎంతంటే మాటల్లో చెప్పలేనంత. కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఇద్దరు ప్రేమైక జీవుల సాహస కృత్యం ఖరీదు.. అక్షరాలా ఒక హత్య.. ఒక ఆత్మహత్య.. ఒక ఉరిశిక్ష.. అరడజనుదాకా యావజ్జీవశిక్షలు. బోనస్‌గా డజన్లకొద్దీ కుటుంబాలకు జీవితకాలం తీరని శోకం.
ఎస్.. అమృత లవ్స్ ప్రణయ్.. ఆ తర్వాత అమృత వెడ్స్ ప్రణయ్.. అది కాస్తా ముదిరి ‘మారుతీరావు కిల్స్ ప్రణయ్’ అనే ఘోరమైన మలుపు తీసుకుని పరువు హత్యల చరిత్రకెక్కి.. తర్వాత కోర్టు మెట్లెక్కిన మిర్యాలగూడ పరువుహత్య గుర్తుందా..? దాదాపు ఏడేళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఎర్రగులాబీల కథ.. కోర్టు తీర్పుతో మళ్లీ చర్చకొచ్చేసింది. ఇద్దరు ప్రేమికులు.. వాళ్ల ప్రేమకు అడ్డుపడ్డ ఒక తండ్రి.. పేట్రేగిన అతడి కుల దురహంకారం.. పరువు కోసం దారుణ హత్యకు తెగించిన వైనం.. క్లుప్లంగా చెప్పుకుంటే ఇదీ మిర్యాలగూడ హానర్ కిల్లింగ్ స్టోరీలో స్క్రీన్‌ప్లే.
ప్రియురాలి కళ్లెదుటే నడిరోడ్డుపై మొండికత్తితో నరికి చంపబడిన ఒక ప్రేమికుడు.. పేరు ప్రణయ్. తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు అనేది అభియోగం. పట్టపగలు.. పైగా పరువు హత్య.. సజీవ సాక్ష్యంగా సీసీ ఫుటేజ్. ఇంకేముంది దేశవ్యాప్తంగా మారుమోగిపోవడమే కాదు.. పరువుహత్యల జాబితాలోకీ ఎక్కేసింది మిర్యాలగూడ ప్రణయ్ హానర్ కిల్లింగ్.
ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసుపెట్టి నిందితుల్ని అరెస్టు చేశారు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టి ఎనిమిది మంది నిందితుల పేర్లతో 2019లో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఐదేళ్లకు పైగా సాగిన విచారణ కొలిక్కొచ్చింది. ఇటీవలే వాదనలు ముగిసి నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు అంతిమతీర్పునిచ్చింది. సుపారీ తీసుకుని.. కత్తి చేతబట్టి నేరంలో నేరుగా పాల్గొన్న ఏ2 సుభాష్‌కుమార్‌శర్మకు ఉరిశిక్ష పడింది.
మిగతా నిందితులు కూడా అనారోగ్య సమస్యలని.. శిక్ష తగ్గించాలని వేడుకున్నా ఫలితం లేకపోయింది. తనకు ఈ కేసుతో సంబంధం లేదని, ముగ్గురు పెళ్లికాని పిల్లలున్నారు దయచూపాలని అమృత బాబాయి శ్రవణ్‌కుమార్ ప్రాధేయపడ్డా నో యూజ్. నిజానికి.. ప్రణయ్ హత్యకు ముందే ఈ కేసు పోలీసుల దగ్గర పంచాయితీకొచ్చింది. 2018 జనవరిలో ప్రణయ్, అమృత పెళ్లి చేసుకోవడంతో రెండు కుటుంబాల మధ్య తేడాలొచ్చేశాయ్. కారణం ప్రణయ్ దళిత కుటుంబీకుడు కావడం, అమృత ఊర్లో పలుకుబడి ఉన ఉన్న వ్యాపారి.. పైగా ఉన్నతకులస్థుడు కావడం. ప్రేమపెళ్లిని మేం ఒప్పుకోం అంటూ ఫిర్యాదులు రావడంతో పోలీసులు కూర్చోబెట్టి మాట్లాడించారు. ప్రణయ్‌తోనే ఉంటానని పోలీసుల సమక్షంలో తేల్చిచెప్పింది అమృత. ఈలోగా గర్భం దాల్చింది కూడా. వైద్యపరీక్షల కోసం భర్త ప్రణయ్, అత్త ప్రేమలతతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది అమృత. తిరిగి వస్తుండగా ప్రణయ్‌పై అగంతకుడి కత్తి దాడి.. అక్కడిక్కడే కుప్పకూలిన ప్రణయ్.
ఇంతకంటే ట్రాజెడీ ఏంటంటే.. కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు 2020 మార్చి 7న ఆత్మహత్యకు పాల్పడ్డం. చేసిన పనికి అప్పటికే పశ్చాత్తాప్పడుతూ అనారోగ్యంపాలై బలవన్మరణం చెందడంతో.. ఒక్కసారిగా ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రిపై సానుభూతి పెల్లుబికింది. స్థానికంగా కుల సంఘాలు, మరికొన్ని వర్గాలు అతడికి మద్దతుగా అమృతకు వ్యతిరేకంగా పెద్దఎత్తున రోడ్డెక్కాయి కూడా. ప్రణయ్ పరువు హత్య కేసులో మరో హృదయవిదారక క్యారెక్టర్ పేరు.. శ్రవణ్‌కుమార్. ఇతడు అమృతకు స్వయానా బాబాయ్ ఔతాడు. అమృత తండ్రి మారుతీరావు మాట విని.. మంచి తమ్ముడనిపించుకోవాలన్న తాపత్రయం అతగాడ్ని నేరస్థుడిగా మార్చేసింది. సుపారీ గ్యాంగ్‌ని సీన్లోకి తెచ్చాడన్న అభియోగం అతడి కుటుంబం మొత్తాన్ని బుగ్గిపాలు చేసింది. మా నాన్న నిర్దోషి.. అంటూ శ్రవణ్‌కుమార్ కూతురి వేదన అరణ్యరోదనే అయింది.
సో.. దగాపడ్డ ప్రేమికుడు నిండు ప్రాణాల్ని అర్పించుకున్నాడు. మొదటి నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండో నిందితుడికి ఉరి శిక్ష పడింది. మిగిలిన ఆరుగురూ జీవితకాలం జైల్లోనే మగ్గిపోతారు.. ఇదీ ఇద్దరి ప్రేమకు దక్కిన తుది ఫలితం. ఇటీవలి కాలంలో ఇన్ని మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్న పరువు హత్య కేసు ఇంకోటి లేదేమో..! అందుకే.. హానర్ కిల్లింగ్స్ అనే దిక్కుమాలిన పరంపరలో మోస్ట్ రిమార్కబుల్ అనిపిస్తోంది అమృత సమర్పించు ప్రణయ్ ప్రేమ గాధ.
ప్రణయ్ హత్యతో మేం చాలా కోల్పోయాం. ఇలాంటి హత్యలు జరగడం విచారకరం. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలి.. సుపారీ ఇచ్చి కన్నకూతురి బంగారు కలల్ని బండబార్చే నేరస్థులకు కనువిప్పు కలగాలి..! తీర్పు తర్వాత ప్రణయ్ తండ్రి వెలిబుచ్చిన ఆశాభావం ఇది. కానీ.. కులం రొచ్చు.. మతం పుచ్చు అంటుకున్న మన సమాజం కాదల్ కహానీలకు కత్తిపోట్లతో క్లయిమాక్స్ ఇవ్వడం మానుకుంటాయా..? మన దేశంలో పరువుహత్యల పర్యవసానాలు ఏం చెబుతున్నాయి..? కోర్టు తీర్పులతో కళ్లు తెరుచుకుంటాయన్న నమ్మకాలెక్కడ?
స్కూల్ ఏజ్ నుంచే ప్రేమలో పడి.. కన్నతండ్రి కంటే మిన్నగా భావించి.. అతడితోనే బతుకుని పంచుకోవాలని ఆశించి.. తాహతుకు మించి త్యాగం చేసి.. నువ్వే సర్వస్వం అని కోట్ల రూపాయల ఆస్తిని సైతం లెక్కచేయకుండా వచ్చేసిన అమృత ఒక వైపు. కుటుంబమే ప్రపంచంగా బతికిన మారుతీరావు మరొకవైపు. కన్నకూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక.. అలా చేస్తేనే కూతురు తన దగ్గరకు తిరిగొస్తుందన్న ఆశతో దారుణానికి పాల్పడి.. ఆనక చేసిన తప్పు తెలిసొచ్చి.. పాపాన్ని కడుక్కునే దారిలేక.. మూడేళ్లపాటు పశ్చాత్తాపంతో కుమిలిపోయిన ఒక సగటు తండ్రి మారుతీరావు. కాకపోతే కులగోత్రాల మీద పట్టింపులు, పరువు-ప్రతిష్టల కోసం పాకులాడ్డం అనే మిగతా లక్షణాలు ఈ సగటు తండ్రిని కసాయితండ్రిగా మార్చేశాయి. వయసుకు మించి ఆలోచించే పరిపక్వత లేక.. మొండిగా ముందుకెళ్లి, సమాజంలో తన పలుకుబడిని బద్నామ్ చేసిందన్న ఆక్రోశం ఆయనలోని మరో కోణాన్ని వెలికితీశాయి.. కన్నకూతుర్ని క్షమించలేనంత హీనస్థితికి దిగజార్చేశాయి. తండ్రీ కూతుర్ల మధ్య జరిగిన ఈ సంఘర్షణలో చివరికి గెలిచిందెవరు.. ఓడిందెవరు? ఎవరు తేల్చాలి? ఇది హైప్రొఫైల్ కేసే కాదు.. మానవీయ కోణాలతో సమాజాన్ని ప్రభావితం చేసే మోస్ట్ సెన్సిటివ్ కేసు కూడా. అందుకే.. విచారణలో పోలీసులకు లెక్కలేనన్ని సవాళ్లు.
పోయిన పరువు ఎలాగూ పోయింది.. పోయిన ప్రాణాల్ని తిరిగి తెచ్చుకోలేం.. నన్ను క్షమించి పుట్టింటికి రా తల్లీ.. అంటూ కన్నకూతుర్ని ఉద్దేశించి ఆత్మహత్య చేసుకునే ముందు లేఖ రాసుకున్నారు మారుతీరావు. కానీ.. పశ్చాత్తాపాలు, బహిరంగ క్షమాపణలు ఏ సమస్యకూ పరిష్కారం చూపవు. మన శిక్షాస్మృతిలో చెల్లుబాటయ్యేవి కావుకూడా. ఐదేళ్ల పాటు సాగిన కోర్టు వాదనల్లో ఇవన్నీ ఉండకపోవచ్చు. 16 వందల పేజీల చార్జిషీట్లో పోలీసులు ఇవన్నీ రాసుండకపోవచ్చు. మన దేశంలో జరిగే ప్రతీ పరువు హత్య వెనుకా బలమైన అంశం.. ఆ ఒక్కటే హ్యూమన్ బిహేవియర్.! వయసు తేడాలు.. ఆలోచనా పరిణితి.. ఇవే కీలకం. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి బలిపీఠమెక్కిన ప్రేమికుడు.. చెట్టంత కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు.. కళ్లు తెరిచి లోకాన్ని చూడకముందే తండ్రిని కోల్పోయిన ఓ పసిగుడ్డు. ఎటుచూసినా గుండెలవిసే విషాదాలే. ఒక పరువు హత్య కొన్ని కుటుంబాల్నే కాదు.. మొత్తం సమాజాన్నే ఛిద్రం చేసే వికృత క్రీడ.
మిర్యాలగూడ పరువు హత్యలో ఇంతటి డెప్తుంది కనుకే.. దీనిమీద సినిమావాళ్లు కూడా ప్రయోగం చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి.. లోకల్ టాక్ తెలుసుకుని పెద్దఎత్తున రిసెర్చ్ చేసిమరీ మర్డర్ పేరుతో సినిమా తీసి సంచలనం సృష్టించారు డైరెక్టర్ వర్మ. ఆ తర్వాత కూడా మిర్యాలగూడ మర్డర్‌లో మరింత మసాలా దట్టించి మరికొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ప్రేమ ప్రాణం ఇస్తుందా తీస్తుందా అని ఎవ్వరూ ఆలోచించి ప్రేమించడు.. అనే కాన్సెప్ట్‌తో చిన్నచితకా రొమాంటిక్ రక్తచరిత్రలు చాలానే వచ్చాయి. తప్పు చేస్తే దండించడం తప్పా.. వేరే దారి లేనప్పుడు చంపించడం తప్పా అనే లాజిక్కుల్ని కూడా జనంలోకి వదిలి చర్చకు పెట్టేశారు. పిల్లల్ని కనగలం గానీ.. వాళ్ల మనస్తత్వాల్ని కనగలమా అనే తల్లిదండ్రుల మనోభావాలు కూడా తెగ ప్రచారంలోకి వచ్చేశాయి. ఆ విధంగా.. సోషల్ మీడియాలో సైతం ఏళ్ల తరబడి ట్రెండింగ్‌లో నడిచింది మిర్యాలగూడ పరువుహత్య. ఎందుకంటే.. అప్పట్లో అమృత అండ్ ప్రణయ్ ప్రేమకథకు ఆరేంజ్‌లో ఉండేది కమర్షియల్ వ్యాల్యూ.
పరువు హత్య అనేది అత్యంత పాశవికం. కేవలం చట్టాలు, శాసనాలతో ఆగిపోవు. సమాజంలో పరివర్తన జరగాలి..! అంటూ దాదాపుగా చేతులెత్తేశారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డి.వై. చంద్రచూడ్. సీజేఐ మాట అక్షరసత్యం. ఎందుకంటే.. మన దేశంలో రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థల్లో కూడా పరువుహత్యల నివారణకు చాలాచాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ.. వాటన్నిటికీ మించి మరో ప్రత్యామ్నాయం కావాల్సిందేనా..?
మిర్యాలగూడ పరువుహత్య.. నేషనల్ బ్రేకింగ్న్యూస్గా మారి.. హానర్ కిల్లింగ్ అనే సబ్జెక్ట్‌పై విస్తృతంగా చర్చ జరిగేలా చేసింది. సోషల్ మీడియాలో సైతం హ్యాష్‌ట్యాగ్స్ పెట్టిమరీ పరువుహత్యలకు వ్యతిరేకంగా పెద్ద మూమెంటే నడిచింది. కానీ… మిర్యాలగూడ ఘోరం తర్వాత పరువు కోసం మరో ఘోరం జరక్కుండా ఆపగలిగామా..? ప్రేమపక్షులపై కులోన్మాదపు కత్తి వేళ్లాడకుండా చూడగలిగామా?
ఇబ్రహీంపట్నం దగ్గర సొంత చెల్లికే ప్రాణాంతకుడిగా మారాడొక అన్న. సూర్యాపేటలో వడ్లకొండ కృష్ణ.. తను ఇష్టపడి పెళ్లాడిన అమ్మాయి కుటుంబం చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. అంతకుముందు జహీరాబాద్ ప్రాంతంలో ఇంకోటి. తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా కులాంతర వివాహాలు చేసుకునే యువతీ యువకులు వందలాది దారుణ హత్యలకు గురవుతూనే ఉన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే గత పదేళ్ళలో 120 మందికి పైగా కుల అహంకార హత్యలకు బలైనట్టు నివేదికలు చెబుతున్నాయి. 2015 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 251 ఆనర్ కిల్లింగ్స్ నమోదైనట్టు చెబుతోంది NCRB రిపోర్ట్. గత ఐదేళ్లలో ఒక్క తమిళనాడులోనే 195 పరువు హత్యలు జరిగినట్లు ఒక NGO సంస్థ సర్వే చేసి తేల్చింది.
గతంలో పరువుహత్య అనే దారుణాన్ని నార్తిండియా నుంచే ఎక్కువగా వినేవాళ్లం. ముఖ్యంగా హర్యానా కాప్ పంచాయతీల్లో ఈ తరహా దుర్మార్గాలు రిపీటెడ్‌గా జరిగేవి. హర్యానాలో ప్రధానంగా మీనాలు, రాజ్‌పుత్‌లు, జాట్ కులాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా తరచూ పరువు హత్యలు జరుగుతుంటాయ్.బిహార్ రాష్ట్రం కేవలం పరువు హత్యలతోనే తలవంపులు తెచ్చుకుంది. ఇప్పుడా పరువు హత్యల పరంపర తెలుగు రాష్ట్రాలకూ పాకేసింది.
పరువుహత్యల కేసుల్లో న్యాయ పోరాటం కోసం ఎస్సి, ఎస్టి అత్యాచారాల నిరోధక చట్టం లాంటివి లేకపోలేదు. వాటికి చాలా మార్పులు-మార్పులు కూడా చేసుకున్నాం. నేరస్థులకు శిక్షలను ఖరారు చేయడమేకాదు.. నేరాలు జరగకుండా నిరోధించే శక్తి కూడా ఉంది ఈ చట్టానికి. కానీ.. కోర్టు బయటే పంచాయతీలు పెట్టి పరిష్కారాలు జరిగిపోతున్నాయి. నానాటికీ పెరుగుతున్న పరువు హత్యల్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుని 2010 జూన్‌లో ఏకంగా ఎనిమిది రాష్ట్రాలకు నోటీసులిచ్చింది. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఎక్కడ అని నిలదీసింది. పరువు హత్యల నివారణ కోసం 1990లో జాతీయ మహిళా కమిషన్ ఒక చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ముందడుగేసింది. పరువు హత్య అనేది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు. రెండు వర్గాల మధ్య జరిగే భావజాల సంఘర్షణ. అందుకే.. కేవలం కేసులు, అరెస్టులు, శిక్షలు మాత్రమే పరిష్కరించలేకపోతున్నాయా?
ఇటీవల సూర్యాపేటలో జరిగిన పరువుహత్యనే తీసుకుంటే.. ఇందులో హంతకుడి నాయనమ్మే కీలక సూత్రధారి. మనవరాలు తక్కువ కులానికి చెందిన వాణ్ణి పెళ్లి చేసుకుంటే సహించలేకపోయిందామె. వాడ్ని చంపినోడికి ఆస్తి రాసిస్తానని చెప్పిందంటే.. ఆమెలో కులదురంహారం ఏ స్థాయిలో పేరుకుపోయిందో అర్థమౌతుంది. సో.. మనిషి లోపల కులం గజ్జి మీటరు మందాన పేరుకు పోయిందన్నమాట. సమాజం నుంచి మనం ఇంకా కులాన్ని నిర్మూలించలేకపోవడమే ఈ మొత్తానికి మూలకారణం. నిచ్చెనమెట్ల వ్యవస్థ లాంటి కులమౌఢ్యాల్ని ఇప్పటికీ అక్కడక్కడా హిందూ మతంలో పాటిస్తున్నారు. పైగా.. కొన్ని సామాజిక సంస్థలు తప్పితే పరువుహత్యల్ని బాహాటంగా ఖండించే ధైర్యమే చేయడం లేదనేది ఒక అభియోగం. వివేకానంద, రామకృష్ణ పరమహంస, రాజారామ్మోహన్ రాయ్ లాంటి సంస్కర్తలు పూనుకుంటే తప్ప గతంలో బెంగాల్లో పరువుహత్యలకు ఫుల్స్టాప్ పడలేదు. మరి.. ప్రేమికులు మరియు తల్లిదండ్రులు.. విరుద్ధ భావాలతో గుడ్డిగా నడుస్తున్న ఈ రెండు వర్గాల్లో పరివర్తన రావాలంటే ఎక్కడో ఒకచోట పెద్ద సామాజిక ఉద్యమమే రావాలి. అంతవరకూ ప్రణయ కథల్లో ఇలా కుల ప్రళయాల్ని చూడాల్సిందే. మారుతీరావు లాంటి క్యారెక్టర్లు పుడుతూనే ఉంటాయ్.