అరేయ్ ఏంట్రా ఇది.. స్మార్ట్ సిటీ పేరుతో రూ.3 వేల కోట్లు కొట్టేసిన బ్రదర్స్.. మామూలోళ్లు కాదుగా..

అరేయ్ ఏంట్రా ఇది.. స్మార్ట్ సిటీ పేరుతో రూ.3 వేల కోట్లు కొట్టేసిన బ్రదర్స్.. మామూలోళ్లు కాదుగా..


ఒకటి కాదు రెండు కాదు.. స్మార్ట్ సిటీ పేరుతో ఏకంగా 3 వేల కోట్ల వరకు కొట్టేశారు ఈ ఇద్దరు బ్రదర్స్. అభివృద్ధి చెందుతున్న నగరంలో తమ కంపెనీని అభివృద్ధి చేస్తామంటూ వేల మందిని బురిడీ కొట్టించారు.. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఇద్దరు సోదరులు సుభాష్ బిజారిణియా, రణవీర్ బిజారిణియా నెక్సా ఎవర్‌గ్రీన్ అనే కంపెనీని స్థాపించారు.. ఆ తర్వాత గుజరాత్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రతిష్టాత్మక ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పేరుతో అనేక మంది నుంచి దాదాపు 3 వేల కోట్ల మేర నిధులు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇది గృహ నిర్మాణం పేరుతో నిర్వహించిన భారీ మోసంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుభాష్ బిజారిణియా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. 2014లో ధోలా సిటీలో అతను భూమి కొనుగోలు చేశారు. తరువాత, ఆయన సోదరుడు రణవీర్ బిజారిణియా కూడా అదే ప్రాంతంలో భూమి కొన్నారు. 2021లో ఈ ఇద్దరు కలిసి నెక్సా ఎవర్‌గ్రీన్‌ అనే కంపెనీని అహ్మదాబాద్‌లో నమోదు చేసుకున్నారు. ఈ కంపెనీ ధోలా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉందని, దాన్ని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయనున్నట్లు సుభాష్ బిజారిణియా, రణవీర్ బిజారిణియా ప్రకటించారు.

ఆ క్రమంలో పెట్టుబడిదారులకు, భూములు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ల్యాప్‌టాప్‌లు, బైక్‌లు, కార్ల వంటి రివార్డులు, కమీషన్లు వస్తాయని సుభాష్ బిజారిణియా, రణవీర్ బిజారిణియా ప్రచారం చేశారు. పెట్టుబడిదారులను మరింత ప్రోత్సహించడానికి ప్రత్యేక ఐడీల ద్వారా రిఫరల్ స్కీమ్‌లను కూడా అమలు చేశారు. ఈ మోసంలో సలీమ్ ఖాన్, సమీర్, దతార్ సింగ్, రక్షపాల్, ఓంపాల్, సంవర్మాల్ వంటి వ్యక్తులూ కీలకపాత్ర పోషించారు. వీరు రాజస్థాన్‌లో వేలాది మంది ఏజెంట్లను నియమించారు.. అలా.. వారు 70 వేల మంది నుంచి.. రూ.2,676 కోట్లు మోసం చేశారని పోలీసులు తెలిపారు. దాదాపు 3వేల కోట్లు వసూలు చేయగా.. దానిలో రూ.1,500 కోట్లు కమిషన్‌గా పంపిణీ చేశారని.. చాలా చోట్ల కార్యాలయాలు కూడా స్థాపించారని అధికారులు తెలిపారు.

అలా వారు సేకరించిన నిధులతో 1,300 బిగ్హా భూమి, గోవాలో 25 రిసార్టులు, రాజస్థాన్‌లో గ్రానైట్, మార్బుల్ మైన్లు, జైపూర్‌లో హోటల్, అహ్మదాబాద్‌లో ఫ్లాట్లు, ఆడీ, బీఎం‌డబ్ల్యూ వంటి విలాసవంతమైన కార్లను కొనుగోలు చేశారు. మిగతా నిధులను 27 షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. విషయం తెలిసిన రాజస్థాన్ పోలీసుల దాదాపు 100 కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది. ఇటీవల, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 24 చోట్ల దాడులు నిర్వహించి, రూ.2.03 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. 10 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది. కంపెనీ డైరెక్టర్లు సుభాష్, రణవీర్ బిజారిణియాలను అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *