అసెంబ్లీ సమావేశాల చరిత్రలో సంచలనం.. ప్రసంగం చదవకుండానే గవర్నర్ వాకౌట్‌..!

అసెంబ్లీ సమావేశాల చరిత్రలో సంచలనం.. ప్రసంగం చదవకుండానే గవర్నర్ వాకౌట్‌..!


తమిళనాడు లో డీఎంకే ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య వివాదం ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. ఎవరికి వారు అస్సలు తగ్గేదెలే.. అన్నట్లు తయారైంది వివాదం. తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన ఆర్.ఎన్. రవి మొదటి నుంచి ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. అలాగే డీఎంకే ప్రభుత్వం కూడా గవర్నర్‌ను అస్సలు లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తీర్మానాలు గవర్నర్‌ దగ్గరే నెలలు తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇలా అనేక అంశాల్లో తలెత్తిన సమస్యలతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమవుతోంది.

తాజాగా తమిళనాడు గవర్నర్ RN రవి అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. జాతీయ గీతాన్ని అవమానించినట్లు ఆరోపించారు. శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, స్పీకర్ అప్పారావును కోరారు గవర్నర్. కానీ సీఎం, స్పీకర్ గవర్నర్ విజ్ఞప్తిని తోసిపుచ్చారు. తమిళ సంప్రదాయం ప్రకారం సభ ప్రారంభానికి ముందు తమిళ రాష్ట్ర గీతం తమిళ్‌ థాయ్‌ వాల్తును ఆలపించారు. దీంతో గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

గతంలో బహిరంగంగా ముఖ్యమంత్రి స్టాలిన్, డీఎంకే ముఖ్య నేతలు గవర్నర్ రవి టార్గెట్‌గా విమర్శలు చేశారు. గత ఏడాది జనవరి గవర్నర్ రవి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి కారణమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో అక్కడ ఉన్న అంశాలను చదవకపోగా లేని అంశాలను ప్రస్తావించారు. అది కాస్తా వివాదంగా మారింది. ప్రసంగంలో ఉన్న అన్నా దురై, కరుణానిధి పేర్లను గవర్నర్ అసెంబ్లీలో చదవకపోగా తమిళనాడు అన్న పేరును మార్చాల్సిన అవసరం ఉంది. తమిళగం అని మార్చాలి అంటూ ప్రసంగంలో తమిళనాడు అనే పదం ఉన్న చోట తమిళగం అని చదవడం వివాదంగా మారింది. డీఎంకే ఎమ్మెల్యే గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుబట్టడంతో గత అసెంబ్లీ సమావేశాల్లో అర్దాంతరంగా తన ప్రసంగాన్ని మధ్యలో నిలిపేసి వెళ్లిపోయారు. దీంతో స్పీకర్ అప్పావు అప్ప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని చదివారు.

తాజాగా మరోసారి అసెంబ్లీ సమావేశాల వేదికగా రచ్చ రాజుకుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఈసారి గవర్నర్ వాకౌట్ చేయడానికి చెప్పిన రీజన్ ఏంటంటే.. సభ మొదలు కాగానే తమిళ తాయి.. అంటే తమిళ తల్లి గీతం ఆలపిస్తారు.. చివర్లో జాతీయ గీతం పాడడం సంప్రదాయంగా వస్తోంది. అయితే మొదట్లోనే జాతీయ గీతం ఆలపించాలని గవర్నర్ పట్టుపట్టారు. దీంతో అది కుదరదని డీఎంకే సభ్యులు చెప్పడంతో గవర్నర్ రవి సభలో ప్రభుత్వం సిద్ధం చేసిన గవర్నర్ ప్రసంగం చేయకుండానే వెళ్లిపోయారు. దీంతో గతంలో మాదిరిగా గవర్నర్ ప్రసంగాన్ని తమిళనాడు స్పీకర్ అప్పావు చదివి వినిపించారు. తన ప్రసంగం చేయకుండా సభ నుంచి వెళ్లిపోవడంతో స్పీకర్ ఇలా గవర్నర్ ప్రసంగాన్ని చదవడం ఇది రెండోసారి.

రెండు సందర్భాల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలోని పలు అంశాలను ఉన్నట్టు కాకుండా గవర్నర్ మార్చి చదవడం అనేది వివాదానికి కారణం అయింది. గవర్నర్ ప్రసంగంలో మహా ప్రభుత్వం అన్న చోట ద్రవిడ మోడల్ అనే పదాన్ని చేర్చడంపై గవర్నర్ అప్పట్లో పదే పదే అభ్యంతరం తెలిపారు. మోడల్ అనే పదం లేకుండానే ప్రసంగం పూర్తి చేయడంతో అప్పట్లో గవర్నర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో డిఎంకె తీర్మానం చేసింది. ఆ సందర్భంలో గవర్నర్‌ – డిఎంకెకు మధ్య వివాదం మరింత ముదిరింది.

మరోవైపు తమిళనాడు వ్యాప్తంగా చాలా చోట్ల గెట్ అవుట్ రవి అంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అటు ప్రభుత్వానికి గాని, ఇటు గవర్నర్ వైపు నుంచి గాని ఉన్నట్టు కూడా కనబడడం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *