ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. దీన్ని తాగినప్పుడు కాలేయం వెంటనే దానిని విచ్ఛిన్నం చేసి శరీరం నుంచి వ్యర్థాలుగా తొలగిస్తుంది. ఈ ప్రక్రియలో, కొన్ని విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి. ఇవి కాలేయాన్ని దెబ్బతీస్తాయి. అదే మీరు ప్రతిరోజూ మద్యం తాగితే ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లివర్‌కు సంబంధించిన ARLD వ్యాధి వస్తుంది.
ఆల్కహాల్-సంబంధిత లివర్ డిసీజ్ (ARLD) అనేది అధికంగా మద్యం సేవించడం వల్ల కలిగే వ్యాధి. ఇది మూడు దశల ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఫ్యాటీ లివర్ (కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం), ఆల్కహాలిక్ హెపటైటిస్ (కాలేయ వాపు), సిర్రోసిస్ (కాలేయం గట్టిపడటం). మొదటి దశ ఫ్యాటీ లివర్. ఇందులో కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. కొన్ని వారాల పాటు ఎక్కువగా ఆల్కహాల్ తాగడం వల్ల ఇది ఏర్పడుతుంది. మీరు సకాలంలో ఆల్కహాల్ తాగడం మానేస్తే, కాలేయం కోలుకుంటుంది.
రెండవ దశ ఆల్కహాలిక్ హెపటైటిస్. దీనిలో కాలేయం వాపుకు గురవుతుంది. దీని వలన అలసట, వాంతులు, ఆకలి లేకపోవడం, చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు) వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే,అది ప్రాణాంతకం కావచ్చు. మూడవ దశ సిర్రోసిస్. దీనిలో కాలేయం చాలా వరకు దెబ్బతింటుంది. దాని స్థానంలో గట్టి కండరాలు వస్తాయి. ఈ దశలో కాలేయం కోలుకోదు. చివరికి కాలేయ మార్పిడి మాత్రమే బతికించేందకు ఏకైక మార్గం అవుతుంది.
కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం, కడుపులో వాపు లేదా నొప్పి, ఆకలి లేకపోవడం, అరచేతులు ఎర్రగా మారడం, అధిక అలసట వంటి లక్షణాలను విస్మరించవద్దు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మీ కాలేయాన్ని కాపాడుకోవడానికి సులభమైన మార్గం తక్కువ ఆల్కహాల్ తాగడం లేదా అస్సలు తీసుకోకపోవడం. మీకు ఇప్పటికే కాలేయ సమస్యలు ఉంటే అస్సలు ఆల్కహాల్ తాగకపోవడమే మంచిది. ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఇది వ్యాధిని గుర్తించడంలో సహాయపడుతుంది.