హైదరాబాద్ లొని కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో విషయం సుప్రీంకోర్టు వరకు చేరింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల్లో చెట్లను ప్రభుత్వం నరికివేస్తుందని… వెంటనే దాన్ని అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ ను జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఎదుట మెన్షన్ చేశారు. అయితే పిటిషన్ పై మధ్యాహ్నం 3.45కు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. మధ్యాహ్నం 3.30లోగా కంచ గచ్చిబౌలి స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు చెట్లు నరకకుండా చూడాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదే విషయంపై అటు ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టుకు వివరించారు. అయితే హైకోర్టులో జరిగే విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..