ఘట్‌కేసర్, జులై 10: ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్ చెరువులో జులై 7న ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈతగాళ్లతో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతుడి ఒంటిపై గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో మృతుడు హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగం (45)గా గుర్తించారు. లింగం ఇంటికి వెళ్లగా.. అతడి భార్య శారద (40) కుమార్తె మనీషా (25) తమ తండ్రి గత నాలుగు రోజులుగా కనిపించడం లేదని ముసలికన్నీరు కార్చారు. ఆయనకు కల్లుతాగే అలవాటు ఉందని, తరచూ ఇంట్లో గొడవ పడేవాడని భార్య చెప్పింది. జులై 6న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, ఆ తర్వాత నుంచి కనబడటం లేదని తెలిపారు. వీరి మాటలపై అనుమానం కలిగిన పోలీసులు చెరువు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు సంగతి బయటపడింది.
లింగం పాతబస్తీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాడు. భార్య శారద జీహెచ్‌ఎంసీలో స్వీపర్. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మనీషాకు వివాహం జరిగింది. మనీషా భర్త స్నేహితుడైన జవహర్‌నగర్ బీజేఆర్‌నగర్‌కు చెందిన మహ్మద్ జావీద్ (24)తో వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో భర్త ఆమెను వదిలేశాడు. ఆమె ప్రియుడితో కలిసి మౌలాలీలో ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. కుమార్తె కాపురం చెడగొట్టుకుని మరో వ్యక్తితో ఉంటున్న విషయం తెలిసి లింగం ఆమెను మందలించాడు. మరోవైపు తల్లిని కూడా లింగం అనుమానిస్తున్నాడని తెలుసుకున్న మనీషా తల్లి శారదతో కలిసి తండ్రిని హత్య చేసేందుకు పథకం పన్నింది.
ఈ క్రమంలో జులై 5న నిద్ర మాత్రలు తీసుకొచ్చి కల్లుతో కలిపిన శారద.. దానిని భర్తతో తాగించింది. అతడు నిద్రలోకి జారుకోవడంతో మనీషా, జావీద్, శారద.. ఈ ముగ్గురు లింగం ముఖంపై దిండుతో అదిమి హత్య చేశారు. ఆ తర్వాత సెకండ్ షో సినిమాకు వెళ్లి.. ఇంటికి వచ్చిన మనీషా క్యాబ్ బుక్ చేసింది. మృతదేహాన్ని కారు ఎక్కిస్తుంటే డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. తమ తండ్రి కల్లు తాగినట్లు నమ్మించారు. అనంతరం ఎదులాబాద్ వద్ద దిగిని ముగ్గురు.. మృతదేహాన్ని చెరువులో పడేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టు ముందు హాజరుపరిచి, రిమాండ్‌కు పంపించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.