
తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) మరోసారి పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంది. టీటీపీ తన స్నిపర్లు అనేక మంది పాకిస్తానీ సైనికులపై మెరుపుదాడి చేస్తున్నట్లు ఒక వీడియోను విడుదల చేసింది. టీటీపీ యోధులు జరిపిన కాల్పుల్లో 10 మంది పాకిస్తానీ సైనికులు మరణించారని పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి గుణపాఠం నేర్పడానికి ఆపరేషన్ అల్-ఖండక్‌ను ప్రారంభిస్తామని TTP ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఆపరేషన్ ద్వారా, పాకిస్తాన్ సైన్యం, భద్రతా సంస్థలు, వారి మిత్రదేశాలపై దాడులు జరుగుతాయి. సైనిక స్థావరాలు, భద్రతా దళాలు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారు. పాకిస్తాన్ సైన్యం గత 77 సంవత్సరాలుగా దేశాన్ని నాశనం చేస్తోందని, దానికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ పేర్కొంది.
బెదిరింపు దాడులతో పాటు, టీటీపీ తన యోధులకు ఆధునిక ఆయుధాలు, గెరిల్లా యుద్ధం, స్నిపర్ దాడులు, ఆత్మాహుతి కార్యకలాపాలలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ ఆర్మీ శిబిరాలు, స్థావరాలను నాశనం చేయడానికి అధునాతన లేజర్ ఆయుధాలను కూడా ఉపయోగిస్తామని TTP తెలిపింది.
2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు తిరిగి రావడంతో, TTP బలపడింది. నవంబర్ 2022లో TTP ఏకపక్షంగా పాకిస్తాన్‌తో కాల్పుల విరమణను ముగించింది. దీని తర్వాత టీటీపీ యోధులు పాకిస్తాన్‌పై దాడులను ముమ్మరం చేశారు. గత కొన్ని నెలల్లో, టీటీపీ అనేక మంది పాకిస్తాన్ సైనికులను, స్థానిక పోలీసులను చంపింది.
మీడియా కథనాల ప్రకారం, 2007లో బైతుల్లా మెహ్సూద్ 13 ఉగ్రవాద గ్రూపులను కలిపి తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)ను స్థాపించాడు. ఇందులో చేర్చిన వారిలో ఎక్కువ మంది పాకిస్తాన్ సైన్యాన్ని వ్యతిరేకించే గ్రూపులకు చెందినవారు. వారి పోరాటం పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా. టీటీపీ అణ్వాయుధాలు కలిగి ఉండవచ్చని అమెరికా పాకిస్తాన్‌ను హెచ్చరించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..