వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు రెండు కివీలు తినడం జీర్ణవ్యవస్థపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక కివీలో మన శరీరానికి కావాల్సిన దాదాపు 80 శాతం విటమిన్ C లభిస్తుంది. అంతేకాక రెండు నుండి నాలుగు గ్రాముల ఫైబర్ కూడా అందుతుంది.
కివీలో ప్రత్యేకమైన పోషకాలు
ఈ పండులో ఆక్టినిడిన్ అనే సహజ ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే విటమిన్ E, విటమిన్ K, యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో చాలా ఉంటాయి. పండు లోపలి భాగం మాత్రమే కాదు.. కొందరు చర్మంతో కలిపి తినడం కూడా మంచిది అనుకుంటారు. ఒక అధ్యయనం ప్రకారం.. నాలుగు వారాల పాటు రోజూ రెండు కివీలు తిన్నవారిలో జీర్ణక్రియ మెరుగుపడినట్లు తెలిసింది.
మలబద్ధకం తగ్గించడంలో కివీ
2022లో చేసిన ఒక పరిశోధనలో వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే మల విసర్జన చేసేవారు కివీ తినడం మొదలుపెట్టిన తర్వాత మల విసర్జనల సంఖ్య పెరిగిందని తెలిసింది. మలబద్ధకం, కడుపు నొప్పి, అజీర్తి లాంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఉపశమనం ఇచ్చింది. 2023లో వచ్చిన ఒక అధ్యయనం కూడా దీన్ని బలపరుస్తుంది. IBS-C (మలబద్ధకంతో కూడిన పేగు సమస్య) ఉన్నవారికి కివీ తినడం వల్ల పేగుల కదలికలు మెరుగవుతాయని తెలిసింది.
మొత్తం ఆరోగ్యంపై ప్రభావం
జీర్ణక్రియతో పాటు.. శరీరంలోని యాంటీఆక్సిడెంట్ అవసరాలను తీర్చడంలో కూడా కివీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఆరోగ్యానికి ఒక సంపూర్ణ పండు. ఇది పేగుల ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కూడా పెంచుతుందని నిపుణులు తెలిపారు.
రోజూ రెండు కివీలు
మీ రోజూవారీ ఆహారంలో కివీ పండును చేర్చడం ఒక చిన్న మార్పు మాత్రమే. దీని వల్ల మీ పేగుల ఆరోగ్యం, జీర్ణక్రియ, శక్తి స్థాయి, ఒత్తిడి నియంత్రణ లాంటి వాటిపై స్పష్టమైన ప్రభావం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రత్యేకంగా సప్లిమెంట్లు తీసుకునే అవసరం కూడా తగ్గుతుంది.
కివీ పండుతో ఆరోగ్యం
చాలా మంది నిపుణుల సలహాలతో, శాస్త్రీయ ఆధారాలతో కివీ పండు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనదిగా గుర్తింపు పొందింది. ఇది జీర్ణక్రియకు సహాయపడడమే కాదు.. మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే శక్తి ఉన్న పండు. మీరు కూడా దీన్ని మీ రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)