కాళేశ్వరం కమిషన్ నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి చేరింది. 650 పేజీలకు పైగా తుది నివేదికను రెండు సీల్డ్ కవర్లలో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు అందజేశారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ చంద్రఘోష్. దాదాపు 16 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై కమిషన్ విచారించింది. నీటిపారుదల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో పాటు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ సహా మొత్తం 119 మందిని విచారించారు పీసీ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ నిర్ణయాల మేరకు జరిగిందా లేదా అనే విషయంపై కూడా కమిషన్ దృష్టి సారించింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కేబినెట్ మీటింగ్ మినిట్స్‌ను ప్రభుత్వం నుంచి తెప్పించుకుని పరిశీలించింది. కమిషన్ నివేదిక అందడంతో ప్రభుత్వం తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ప్రధానంగా మూడు అంశాలను కమిషన్ నివేదికలో ప్రస్తావించింది. డిజైన్‌లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఆర్థికపరమైన అంశాలపై నివేదిక సమర్పించింది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధులు విడుదల చేయడం.. హైలెవల్ కమిటీ అనుమతి లేకుండా బడ్జెట్ రిలీజ్ చేసిట్లు నివేదికలో ప్రస్తావించారు. IASలు, ఇంజినీర్ల మధ్య సమన్వయం లోపం.. క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా నాటి ప్రభుత్వ పెద్దల సంప్రదింపులు జరపడంతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు సమాచారం లేదని కమిషన్ స్పష్టం చేసింది. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే డిజైన్లు మార్పు చేసినట్లు కమిషన్ తేల్చింది. మూడు బ్యారేజీలకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలను వేర్వేరుగా పొందుపర్చింది కమిషన్. అధికారుల తప్పిదాలపై లీగల్ అంశాలతో ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది.
ఈ సందర్భంగా కమిషన్ చీఫ్, జస్టిస్ పినాకి చంద్రఘోష్ మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్ విచారణలో తన పాత్ర ముగిసిందన్నారు. ప్రభుత్వానికి సూచనలు ఏమీ లేవన్నారు. కమిషన్ ఆర్డర్ ప్రకారం తుది రిపోర్ట్ ఉందన్నారు. రిపోర్ట్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది తెలీదన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించడంతో.. అటు ప్రభుత్వ, ఇటు రాజకీయ వర్గాల్లో తర్వాత ఏం జరగబోతుందని తీవ్ర చర్చనీయాశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.