హోలీ , రంజాన్ వేడుకల వేళ ఉత్తరప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. తవ్వకాల్లో హిందూ ఆలయాలు బయటపడ్డ సంభల్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం రోజే హోలీ పండుగ రావడంతో జామా మసీదు దగ్గర ముస్లింల ప్రార్థనలపై ఉత్కంఠ నెలకొంది. ఏడాదిలో హోలీ పండుగ శుక్రవారం ఒక్కసారే వస్తుందని , ముస్లింలు ఏడాదిలో 52 శుక్రవారాలు నమాజ్ చేస్తారని , రంగులు పడుతాయని అనుకుంటే ముస్లిలు ఇళ్ల లోనే నమాజ్ చేయాలన్న పోలీసు సర్కిల్ ఆఫీసర్ అనుజ్ చౌదరి వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది.
“హోలీ ఏడాదిలో ఒక్కసారే వస్తుంది.. జుమ్మా ఏడాదిలో 52 సార్లు వస్తుంది. హోలీ రోజు రంగులు పడి తమ దీక్ష భంగమవుతుందని ముస్లింలు అనుకుంటే ఇళ్ల నుంచి బయటకు రావద్దు. హోలీ పండుగ నాడు హిందువులు స్వీట్లు పంచుకున్నట్టే , రంజాన్ నాడు ముస్లింలు స్వీట్లు తింటారు ” అని సంభల్ సర్కిల్ పోలీసు ఆఫీసర్ అనూజ్ చౌదరి కామెంట్స్ చేశారు.
అయితే పోలీసు అధికారి అనూజ్ చౌదరి వ్యాఖ్యలపై అటు ముస్లిం సంస్థలు , ఇటు సమాజ్‌వాదీ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారం లోకి రాగానే అనూజ్ చౌదరిని తప్పకుండా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్.
మరోవైపు మథురలో హోలీ వేడుకలకు హాజరయ్యారు సీఎం యోగి.. శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు యోగి . భగవాన్ కృష్ణుడి జన్మస్థానంలో హోలీ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అయోధ్య , కాశీ , ప్రయాగ్‌రాజ్ నగరాలను అభివృద్ధి చేశామని , ఒక మథుర మాత్రమే మిగిలి ఉందన్నారు. శ్రీకృష్ణ జన్మభూమిని అందంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. దీని కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని తెలిపారు.
మథుర శ్రీ కృష్ణ జన్మభూమిపై కోర్టులో వివాదం నడుస్తున్నవేళ యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో కూడా హోలీ వేడుకలు నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రకటించడం కాకరేపుతోంది.