
బిస్కెట్లు మామూలుగా ఎక్కువ ప్రాసెస్ చేసిన పిండి, తెల్ల చక్కెర, హానికరమైన కొవ్వులతో తయారు చేస్తారు. వీటిని జంక్ ఫుడ్ అంటారు. ఎందుకంటే వీటిలో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు లేదా ఫైబర్ తక్కువగా ఉంటాయి. తరచూ వీటిని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. రోజూ బిస్కెట్లు తినడం వల్ల వచ్చే ముఖ్యమైన సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- బరువు పెరుగుతారు.. బిస్కెట్లలో చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఎక్కువ కేలరీలు చేరతాయి. ఇవి శరీరంలో కొవ్వుగా మారి బరువు పెరగడానికి కారణం అవుతాయి.
- షుగర్ ప్రమాదం.. ఎక్కువ చక్కెర తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది షుగర్ ఉన్నవారికి చాలా హానికరం. అలాగే ఎక్కువ కాలం తింటే ఇన్సులిన్‌కు శరీరం స్పందించకపోవడం లాంటి సమస్యలు రావచ్చు.
- గుండె జబ్బులు.. ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు బిస్కెట్లలో ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం పెరిగి గుండెపోటు లేదా స్ట్రోక్‌కు కారణం అవ్వొచ్చు.
- జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాలు.. బిస్కెట్లలో ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ బలహీనపడుతుంది. దీని వల్ల మలబద్ధకం, అసిడిటీ, కడుపులో గ్యాస్, ఉత్సాహం లేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఫైబర్ లేని ఆహారం జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెట్టడమే కాదు.. శరీరాన్ని శక్తి లేని స్థితిలోకి నెట్టేస్తుంది.
- మానసిక ఆరోగ్యంపై ప్రభావం.. చక్కెర వల్ల తక్షణ శక్తి వస్తుంది. కానీ అది వెంటనే తగ్గిపోతుంది. ఇది మానసిక అలసట, మూడ్ స్వింగ్‌లు, నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. అదనంగా ట్రాన్స్ ఫ్యాట్, ఎక్కువ చక్కెర శరీరాన్ని మాత్రమే కాదు.. మనసును కూడా ప్రభావితం చేస్తాయి.. ఇవి ఒత్తిడి, ఆందోళన స్థాయిలను పెంచుతాయి.
పిల్లలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు
బిస్కెట్లకు బదులుగా గోధుమ బిస్కెట్లు, ఓట్స్ స్నాక్స్ లేదా ఇంట్లో తయారు చేసిన డ్రై ఫ్రూట్స్ బేస్డ్ బార్ లు ఇవ్వడం ఉత్తమం. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, సహజ శక్తినిచ్చే పదార్థాలు ఉంటాయి. పిల్లలు చిన్నతనంలో ఏ అలవాట్లు నేర్చుకుంటారో అవే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
చిన్నగా కనిపించే బిస్కెట్లు.. పెద్దగా సమస్యలు తెస్తాయి. అలవాటు పడటం సులువు.. కానీ ఆరోగ్యాన్ని కోల్పోవడం మరింత త్వరగా జరుగుతుంది. మీ పిల్లల శరీరానికి కావాల్సిన పోషకాలు ఇచ్చే తిండి ఇవ్వండి.