ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ భారీ క్రిప్టో కరెన్సీ స్కామ్ కూడా బయటపడింది. బెంగళూరు పోలీసులు ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ CoinDCX నుండి జరిగిన భారీ క్రిప్టోకరెన్సీ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్నారు. హ్యాకర్లు కంపెనీ వాలెట్ల నుండి దాదాపు 44 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 384 కోట్లు) మోసం జరిగినట్లు గుర్తించారు.
జూలై 19న CoinDCX తన సిస్టమ్స్‌లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించినప్పుడు ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. CoinDCX పబ్లిక్ పాలసీ అండ్ గవర్నమెంట్ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ జూలై 22న దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం.. హ్యాకర్లు మొదట ఉదయం 2:37 గంటలకు కేవలం 1 USDT విలువ చేసే చిన్న టెస్ట్ బదిలీని నిర్వహించారు. కొన్ని గంటల తర్వాత వారు 44 మిలియన్ డాలర్ల విలువైన భారీ లావాదేవీని చేశారు. ఈ లావాదేవినీ గుర్తించకుండా ఉండటానికి దొంగిలించిన క్రిప్టోకరెన్సీని బహుళ వాలెట్లలోకి బదిలీ చేశారు. దీంతో వాటిని గుర్తించడం కష్టమైంది.
దర్యాప్తులో పోలీసులు అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలను కనుగొని CoinDCX ఉద్యోగి రాహుల్ అగర్వాల్‌ను అరెస్టు చేశారు. అగర్వాల్ అనుమతి లేకుండా కంపెనీ జారీ చేసిన ల్యాప్‌టాప్‌ను ఉపయోగించి ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాడని, గత ఏడాది కాలంలో దాదాపు రూ.15 లక్షలు సంపాదించాడని వర్గాలు తెలిపాయి. దోపిడీని నిర్వహించడానికి అతను బాహ్య హ్యాకర్లతో కలిసి పనిచేసి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. సైబర్ క్రైమ్ బృందాలు ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి నిధుల ప్రవాహాన్ని ట్రాక్ చేయడానికి, దొంగిలించబడిన క్రిప్టోకరెన్సీని తిరిగి పొందడానికి పనిచేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి