
వేసవిలో శరీరాన్ని తేమతో ఉంచడం ముఖ్యం. అందుకే ఎక్కువ ద్రవాలను తీసుకోవాలి. అలాగే వేడి వల్ల తలెత్తే అసౌకర్యాన్ని తగ్గించడానికి చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది. సాధారణ నీటితో కాకుండా.. కొన్ని సహజ పదార్థాలతో స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడమే కాకుండా.. ఒత్తిడిని తగ్గించి మెరుగైన నిద్రకు సహాయపడుతుంది.
శరీర నొప్పులను తగ్గించేందుకు అల్లం రసం ఉపయోగపడుతుంది. ఒక బకెట్ నీటిలో కొద్దిగా అల్లం పొడి లేదా అర కప్పు అల్లం రసాన్ని కలిపి స్నానం చేయాలి. ఇది చెమట వాసనను కూడా తగ్గిస్తుంది.
చర్మాన్ని పొడిబారకుండా ఉంచేందుకు ఆలివ్ నూనె ఉపయోగించాలి. ఇది తేమను కాపాడి చర్మాన్ని మెరుగు పరుస్తుంది. మొటిమలు ఉన్నవారు వైద్యుల సలహాతో ఆలివ్ నూనె ఉపయోగించాలి.
వేప నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. కొన్ని వేప ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని చల్లారిన తర్వాత స్నానానికి ఉపయోగించాలి.
శరీరాన్ని చల్లగా ఉంచి మంచి సువాసన రావడానికి రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది. 4-5 గులాబీ రేకులను మరిగించి ఆ నీటిని స్నానానికి ఉపయోగించాలి.
లావెండర్ ఆయిల్ ఒత్తిడిని తగ్గించి చెమట వాసనను దూరం చేస్తుంది. కొన్ని చుక్కలు లావెండర్ ఆయిల్ నీటిలో వేసి స్నానం చేయాలి.
పసుపు శరీరాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. కొద్దిగా పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలి.
గంధపు నీరు ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. కొద్దిగా గంధపు పొడిని లేదా గంధపు నూనెను నీటిలో కలిపి స్నానం చేయాలి.
తులసి ఆకులు శరీరాన్ని శుద్ధి చేయడంతో పాటు మానసిక ప్రశాంతతను పెంచుతాయి. కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలాంటి సహజ పదార్థాలను వేసవి స్నానాలలో ఉపయోగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.