ప్రతి ఇంట్లో పెద్దలు తమ తర్వాత తరాల వారికి కొన్ని ముఖ్య మార్గదర్శకాలు ఇస్తుంటారు. ముఖ్యంగా కుటంబ కట్టుబాట్లు, సంప్రదాయాలు, విలువలు వంటివి సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి చెబుతుంటారు. అలాగే కొన్ని ముఖ్య కట్టుబాట్ల గురించి కూడా పదేపదే హెచ్చరిస్తుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి.. ఇంటి వాకిట్లో కూర్చోవడం మంచిది కాదు. ఈ మాట దాదాపు ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది.
ఖాళీ సమయంలో పిల్లలు, కుర్రకారు ఇంటి గుమ్మం వద్ద కూర్చుని ఫోన్ చూసుకోవడం లేదంటే ఇంకేదో పని చేస్తుంటారు. ఇలాంటి సీన్ కనిపిస్తే పెద్దవాళ్లు దాదాపు కొట్టినంత పని చేస్తారు. సాయంత్రం పూట గుమ్మం వద్ద నిలబడ వద్దని, గుమ్మం మీద కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పాలని కోప్పడుతుంటారు.
అసలెందుకు కూర్చోకూడదో పిల్లలు అర్ధంకాదు. దీనివెనుక ఉన్న రహస్యం ఇక్కడ తెలుసుకుందాం.. నిజానికి హిందూ గ్రంధాల ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం తల్లి లక్ష్మిదేవితో ముడిపడి ఉంటుందట.
ఆమె సాయంత్రం వేళల్లో ప్రతి ఇంటికి వెళ్తుందని నమ్ముతారు. ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా గుమ్మం మీద నిలబడి లేదా కూర్చుంటే లక్ష్మీ దేవి గుమ్మంలో అడుగు పెట్టకుండా తిరిగి వెళ్లిపోతుందని నమ్ముతారు.
అందుకే సాయంత్రం పూట గుమ్మం మీద కూర్చోవడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఇంటి తలుపుల ముందు బూట్లు, చెప్పులు కూడా పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని నమ్ముతారు. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించి, వీలైతే సాయంత్రం పూట ప్రధాన ద్వారం తెరిచి ఉంచడం మంచిదని కూడా చెబుతుంటారు.