సారొస్తారొస్తారా..? మరోసారి ఈ ప్రశ్న తెరపైకి వచ్చింది. విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5 .. డేట్ కూడా ఫిక్స్ అయింది. అప్పటి మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్ కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కమిషన్. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఆ ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. జస్టిస్ PC ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా పూర్తయ్యే దశకు చేరుకుంది. ఈ చివరి దశలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్, జూన్ 6న ఈటెల రాజేందర్, చివరగా జూన్ 9న హరీష్ రావు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
నోటీసు అందుకున్న అప్పటి నుంచి పార్టీలో కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కావాలా లేదా అని అంశంపై తర్జనభర్జన జరిగింది. ఇప్పటికీ కెసిఆర్ ఫామ్ హౌస్ లో చాలాసార్లు దీనిపై చర్చించారు. పార్టీతో పాటు న్యాయం నిపుణులతో చర్చలు జరిపి సలహాలు తీసుకున్నారు. గతంలో విద్యుత్ కొనుగోళ్లపై వేసిన కమిషన్ పై నోటీసు అందుకున్న కేసీఆర్ చాలా తీవ్రంగా ప్రతిస్పందించారు. కమిషన్‌కు లేఖ రాస్తూ కమిషన్ ఏర్పాటు, కమిషన్ గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి అక్కడ కొనసాగడం తప్పంటూ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు మాత్రం ఆ పంథాలో వెళ్లకూడదని భావిస్తున్నట్లు తెలిసింది.
అయితే నిజానికి పోయిన ఏడాది అసెంబ్లీలో కాళేశ్వరంపై కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోండి అంటూ సవాల్ విసిరిందే బీఆర్ఎస్. తీరా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన తర్వాత హాజరు కాకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, కమిషన్‌ను గౌరవించకపోతే అది బీఆర్ఎస్ పై దెబ్బ పడుతుందని భావిస్తున్నారు. హాజరైతే ప్రజల్లో సింపతీ పెరుగుతుందని, ప్రభుత్వం కావాలనే కక్ష గట్టి విచారణలకు తిప్పుతుందని సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. మొత్తానికి మొదటిసారిగా ఓ విచారణకు గులాబీ దళపతి హాజరవుతారని తెలుస్తోంది. మరోవైపు పార్టీలో గంభీర వాతావరణం కనిపిస్తుంది. జూన్ 5 బిగ్ డే అంటూ చర్చిస్తున్నారు కార్యకర్తలు.
ఇక కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. గత ప్రభుత్వ హయాంలో కీలక పోస్టులను డీల్ చేసిన అధికారులు సోమేష్‌కుమార్, స్మిత సబర్వాల్, రజత్‌కుమార్ వంటి వారిని బహిరంగ విచారణకు పిలిచింది. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు, కాళేశ్వరంగా రూపాంతరం చెందడం మొదలు, ప్రాజెక్టు డిజైన్‌లు, అనుమతులు, నిధులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసింది. ముఖ్య ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచడంపై ఆరా తీసింది. నిర్మాణం పూర్తి కాకుండానే బకాయిల చెల్లింపుపై కూడా కూపీలాగింది.
ఈ సమాచారాన్ని క్రోడికరించిన పీసీ ఘోష్ కమిషన్.. గత ప్రభుత్వ హయాంలో కీలక నిర్ణయాలు తీసుకున్న పెద్దలను ప్రశ్నించాలని నిర్ణయించింది. ఆ క్రమంలోనే నోటీసులు జారీ అయ్యాయి. ఇక, మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు హరీష్‌రావు, ఈటల విచారణకు సంబంధించి ఇప్పటికే కొశ్చనరీ సిద్ధమైందా? టెక్నికల్ అంశాలతో పాటు నిధుల వ్యవహారంపై కూడా కమిషన్ ప్రధానంగా ఫోకస్ చేసిందా?. నోటీసులపై బీఆర్ ఎస్, ముఖ్యంగా కేసీఆర్ స్ట్రాటెజీ ఎలా వుండబోతుందన్నది చర్చగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..