తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వస్తున్నారు సినీ,క్రీడా ప్రముఖులు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించి సినీనటుడు అజయ్ దేవగన్,భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో క్రీడాభివృద్ధికి, సిని ఇండస్ట్రీ ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు ప్రసంసించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్దిలో భాగమయ్యేందుకు తాము తీసుకుంటున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇతర సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని నటుడు అజయ్ దేవగణ్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణంతో పాటు సినీ పరిశ్రమలో వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు.. నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అజయ్ దేవగణ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు ప్రచారకర్తగా ఉంటానని అజయ్ దేవగణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు.
వీడియో చూడండి..
క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన కపిల్‌దేవ్..
తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రశంసించారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి కపిల్ దేవ్‌కు వివరించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు తెలంగాణలో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాల్లో తాను భాగస్వామినవుతానని కపిల్ దేవ్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియాతో పాటు పలు దేశాల్లో తాము సందర్శించిన క్రీడా యూనివర్సిటీలు.. అక్కడి క్రీడా ప్రముఖులతో తమ భేటీల వివరాలను సీఎం రేవంత్ రెడ్డి కపిల్ దేవ్‌కు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.