సృజనాత్మకతకు అరుదైన గౌరవం.. గణతంత్ర వేడుకలకు నెల్లూరుకు చెందిన సాధారణ మహిళకు ఆహ్వానం!

సృజనాత్మకతకు అరుదైన గౌరవం.. గణతంత్ర వేడుకలకు నెల్లూరుకు చెందిన సాధారణ మహిళకు ఆహ్వానం!


మనలో చాలా మందికి దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను కళ్లార చూడాలని ఉంటుంది కానీ వెళ్లలేం..! అక్కడికి వెళ్ళాలన్న, అక్కడ జరిగే వేడుకలు ప్రత్యక్షంగా చూడాలన్న అందరికి అయ్యే పని కాదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన ఒక మహిళకు మాత్రం అరుదైన గౌరవం దక్కింది. ప్రత్యక్షంగా ఢిల్లీలోని ఎర్ర కోటలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది. అయితే ఆహ్వానం అందుకున్న మహిళ గొప్ప సెలబ్రిటీ కాదు. సాధారణ మహిళ. ఇంతకీ ఆ మహిళ ఎవరు ఎర్ర కోటలో నిర్వహించే వేడుకలు చూసేందుకు ఆమెకు ఆహ్వానం ఎలా అందిందో తెలుసుకుందాం..!

నెల్లూరు జిల్లా ఉదయగిరి దిలార్ బావి వీధికి చెందిన షాహీనా అనే మహిళకు జనవరి 26న ఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది. ఈ వేడుకలకు హాజరు కావాలంటూ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి షాహీనా దంపతులకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఉదయగిరి పట్టణానికి చెందిన షాహీనా గత 20 సంవత్సరాలుగా చెక్క నగిషి కేంద్రం నిర్వహిస్తుంది. ఆ చెక్క నగిషీ కేంద్రమే ఆమెకు జాతీయ స్థాయి గుర్తింపు తేవడంతోపాటు ఎర్ర కోటలో అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించింది.

హస్తకళలతో ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఈ కేంద్రంలో సుమారు 400 మంది మహిళలు చెక్క పనిలో నైపుణ్యంతో రకరకాల గృహపయోగ వస్తువులు, అలంకార బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ కేంద్రంలో తయారయ్యే చెక్క వస్తువులు ఉత్తరాదిలో కూడా విశేషంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. పలు రాష్ట్రాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి ఈ వస్తువుల అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యే ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో ఉదయగిరి చెక్క నగిషి కేంద్రం తన ఉత్పత్తులను ప్రదర్శించింది.

ఉదయగిరి చెక్క నగిషి ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రం చెక్క బొమ్మలను చూసి ముగ్ధులయ్యారు. ప్రధానమంత్రి ఈ కేంద్రాన్ని పరిశీలించడమే కాకుండా, విశ్వకర్మ పథకం ద్వారా కేంద్రానికి అదనపు ప్రోత్సాహం కల్పించేందుకు ముందుకు వచ్చారు. 120 మంది మహిళలకు ఉచిత శిక్షణ అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇది ఈ కేంద్రానికి మాత్రమే కాదు, అక్కడ పని చేసే కార్మికులకు ఒక గొప్ప అవకాశంగా మారింది. ఇంతటితో ఆగకుండా, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ప్రత్యేక గుర్తింపుగా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నుంచి షాహీనాకు ఆహ్వానం అందడం మరో గర్వకారణంగా మారింది. జనవరి 26న ఢిల్లీలో జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు.

తమ కృషిని గుర్తించి, ఈ అరుదైన అవకాశం కల్పించిన ప్రధానమంత్రికి షాహీనా దంపతులు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆహ్వానం మరింత ఉత్సాహాన్ని, గుర్తింపును తీసుకువస్తుందని కేంద్ర నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనేక అవరోధాలను అధిగమించి, మహిళా సాధికారితకు మద్దతుగా నిలిచిన ఈ చెక్క నగిషి కేంద్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల గర్వకారణంగా మారింది. ఉదయగిరి చెక్క నగిషి కేంద్రం మహిళా శక్తి, సృజనాత్మకతకు ఓ నిదర్శనంగా మారింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *