10th Public Exams 2025: మరికాసేపట్లో ‘పది’ పరీక్షలు ప్రారంభం.. ఆఖరి నిమిషంలో ఈ తప్పులొద్దు!

10th Public Exams 2025: మరికాసేపట్లో ‘పది’ పరీక్షలు ప్రారంభం.. ఆఖరి నిమిషంలో ఈ తప్పులొద్దు!


హైదరాబాద్‌, మార్చి 21: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు శుక్రవారం (మార్చి 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 4వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. సైన్స్‌ సబ్జెక్టును రెండు విభాగాలుగా విడగొట్టడంతో.. ఫిజికల్, బయలాజికల్‌ పేపర్లకు ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. మొత్తం 11,547 పాఠశాలల నుంచి 5.09 లక్షల విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,650 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి 25 మంది విద్యార్థులకు ఒకరి చొప్పున మొత్తం 28,100 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.

ఇక విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 9.30 గంటలకల్లా చేరుకోవాలి. ఏదైనా కారణం చేత ఆలస్యమైతే ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు. ఎందుకైనా మంచిది గంటముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు విద్యార్ధులకు సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, గోడగడియారాలు ఏర్పాటు చేశారు. అలాగే వేసవి కావడంతో విద్యార్ధులకు నీటి సౌకర్యం కూడా కల్పించారు. విద్యార్థులకు సందేహాలుంటే 040-232 30942 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు ఈసారి ప్రత్యేకంగా ప్రశ్నపత్రంలో క్యూఆర్‌ కోడ్‌ను ముద్రిస్తున్నారు. ఈ కోడ్‌ను స్కాన్‌ చేస్తే సీరియల్‌ నంబరు వస్తుంది. పేపర్‌ లీక్‌ అయితే అది ఎక్కడి నుంచి జరిగిందనేది వెంటనే గుర్తించవచ్చు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను కెమెరాల ఎదురుగానే ఓపెన్‌ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లడానికి వీల్లేదు. ఉదయం 9.35 దాటితే పరీక్షకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించమని ఎస్సెస్సీ బోర్డు స్పష్టం చేసింది. అయితే రవాణా సౌకర్యం అంతగాలేని ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో విద్యార్ధుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వేసవితీవ్రత కారణంగా విద్యార్థులు డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉండటంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్ధులకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *