సరైన సమయానికి మెరుగైన వైద్యం అందక, వైద్యుల నిర్లక్ష్యంతో ఒక ఆర్మి అధికారి ఏడాదిన్నర కుమారుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరాఖండ్‌లో వెలుగు చూసింది. నాలుగు జిల్లాల్లోని ఐదు ఆసుపత్రులకు రిఫర్ చేయబడిన తర్వాత, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న ఏడాది వయసున్న బాలుడు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన దినేష్ చంద్ర జోషి ఆర్మీ ఆఫీస్‌గా పనిచేస్తున్నాడు. ఇతని ఇటీవలే పెళ్లై ప్రస్తుతం ఏడాది బాబు ఉన్నాడు. అయితే జూలై 10న, దినేష్ కుమారు చిన్న శివాంశ్‌కు అనారోగ్యానికి గురయ్యాడు. బాలుడికి తరచూ వాంతులు కావడం, తల్లిపాలు ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో తల్లి వెంటనే బాలుడిని గ్వాల్డామ్‌లోని ఒక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. అయితే అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో.. అక్కడి నుంచి 22 కి.మీ దూరంలో ఉన్న బాగేశ్వర్‌లోని బైజ్‌నాథ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు బాలుడిని తీసుకెళ్లమని వైద్యులు సూచించారు.
వైద్యుల ఆదేశంతో తల్లి బాలుడిని బాగేశ్వర్‌లోని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అక్కడ ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీలో ఉన్న వైద్యుడు పిల్లాడిని పట్టించుకోకుండా ఫోన్ వాడుతూ కూర్చున్నాడని, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని బాలుడి తండ్రి ఆరోపించారు. వైద్యుడితో పాటు నర్సులు కూడా జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ తమ కుమారుడిని పట్టించుకోలేదన్నారు. తర్వాత గట్టిగా నిలదీయగా హాస్పిటల్‌లో పీడియాట్రిక్ ఐసియు యూనిట్ లేదని అక్కడి నుంచి వైద్యులు మరో హాస్పిటల్‌కు రెఫర్ చేసినట్టు తెలస్తోంది.
చిన్నారి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. వైద్యుల ఆదేశాలతో బాబును మరో హాస్పిటల్‌కు తరలించేందుకు రాత్రి 7 గంటలకు ఆమె అంబులెన్స్‌కు ఫోన్ చేసింది, కానీ అంబులెన్స్ వెంటనే రాకపోవడంతో.. జోషి జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫోన్ చేసి సహాయం కోరారు. అప్పుడు కూడా సుమారు రెండున్నర గంటల తర్వాత అంబులెన్స్ వచ్చినట్టు ఆమె పేర్కొంది. ఆమె మాట్లాడుతూ.. మెరుగైన చికిత్స కోసం 108కి కాల్ చేయమని వైద్యులు కోరినప్పుడు, నేను ఫోన్ చేశాను, కానీ వెంటనే ఎవరూ స్పందించలేదు.. ఆ టైంతో నేను ఒంటరిగా ఉన్నాను, నా భర్త జమ్మూ కాశ్మీర్‌లో డ్యూటీలో ఉన్నాడని ఆమె చెప్పింది. అంబులెన్స్ రాలేదని తాను వైద్యులకు చెప్పినప్పటికీ.. ఆసుపత్రి సిబ్బంది తమను పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక రాత్రి 9:30 గంటలకు అంబులెన్స్ రావడంతో బాబును నాలుగో హాస్పిటల్‌కు తీసుకెళ్లింది తల్లి. అయితే అక్కడ బాబును పరీక్షించిన వైద్యులు చికిత్స అందించిన తర్వాత నైనిటాల్‌లోని హల్ద్వానీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో ఆమె బాబును తీసుకొని జూలై 12న, హల్ద్వానీలో హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ బాబు పరీక్షించిన వైద్యులు అతన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే, నాలుగు రోజుల తర్వాత, జూలై 16న, బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయం విన్న తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది.కన్న కొడుకుని కాపాడుకోలేక బోరునా విలపించింది.
ఈ సందర్భంగా ఆమె ఎంతో ఆవేదనకు గురైంది. దేశాన్ని కాపాడుతూ సరిహద్దులో ఉన్న బాలుడి తండ్రి, తన ఇంటి వెలుగు దీపమైన బిడ్డను కాపాడుకోలేకపోయాడని ఆమె గుండె పగిలిపోయేలా రోధించింది. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఆమె కన్నీరుపెట్టుకుంది. ఘటనపై స్పందించిన రాష్ట్ర సీఎం ధామి ఘటనపై విచారణకు ఆదేశించారు. చిన్నారి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.