ప్రతి రోజు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే.. మనం తినే ఆహారం, తీసుకునే ద్రావణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఉదయం శక్తివంతమైన రోజు ప్రారంభం ఎలా అవసరమో, అదేలా రాత్రి శాంతంగా నిద్రపోవడం కూడా అంతే అవసరం. దీనిలో గ్రీన్ టీ సహజమైది. అలసిపోయిన రోజుకు ముగింపు ఇచ్చే ముందు రాత్రి పడుకునే సమయంలో ఒక కప్పు గ్రీన్ టీ తాగడం ద్వారా శరీరానికి విశ్రాంతి లభించడమే కాకుండా.. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది ఆరోగ్యంపై ఎన్నో విధాలుగా ప్రభావం చూపుతుంది.
స్ట్రెస్ రిలీఫ్
గ్రీన్ టీలో ఉండే ఎల్ థియనిన్ అనే ప్రకృతిలో సహజంగా లభించే అమైనో ఆమ్లం మెదడు శాంతియుత స్థితిలోకి రావడానికి దోహదపడుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ ఆందోళనను నియంత్రించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట ఇది తాగినవెంటనే నెమ్మదిగా మానసిక విశ్రాంతి కలుగుతుంది.
అధిక బరువు
గ్రీన్ టీ జీవక్రియను మెరుగుపరిచే గుణాన్ని కలిగి ఉంది. రాత్రిపూట తాగినప్పుడు కూడా శరీరం కొవ్వు కాల్చే పనిని కొనసాగిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కొవ్వు కణాలపై ప్రభావం చూపి తక్కువగా నిల్వ అయ్యేలా చేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. గ్రీన్ టీ కారణంగా జీవక్రియ వేగం 4 శాతం వరకు పెరుగుతుందని గుర్తించబడింది.
గుండె ఆరోగ్యం
గ్రీన్ టీ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నివేదించింది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి ఆరోగ్యకరమైన లిపిడ్ స్థాయిలను ప్రోత్సహిస్తుంది. జపాన్ లో జరిగిన ఒక అధ్యయనంలో రోజుకు ఐదు కప్పుల గ్రీన్ టీ తాగేవారికి గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గాయని కనుగొన్నారు.
ప్రశాంతమైన నిద్ర
నిద్రలేమి ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దీనికి గ్రీన్ టీ ఒక సహజ నివారణగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ శరీరానికి అవసరమైన విశ్రాంతిని అందిస్తుంది. ఇందులో ఉండే ఎల్ థియనిన్ హార్మోన్లను సమతుల్యం చేసి మెదడును ప్రశాంతమైన స్థితికి తీసుకువెళుతుంది. దీనివల్ల నిద్ర గాఢంగా, నిరాటంకంగా పడుతుంది.
చల్లటి వాతావరణంలో గ్రీన్ టీ తాగడం శరీరానికి హాయిగా ఉండే అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా శరీరానికి విశ్రాంతి, మానసిక ప్రశాంతత, జీవక్రియ పెంపు వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)