
ఖాకీలంటేనే కఠినాత్ములు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. జనాలకు రక్షణగా శాంతిభద్రతల పరిరక్షణకు.. నేరస్తుల పట్ల కఠినంగా ఉండే పోలీసులను చూస్తుంటాం. అయితే మనుషుల పట్లనే కాదు.. మూగ జీవాలను సంరక్షించి తమలో కూడా మానవత్వం ఉందని నిరూపించారు నల్లగొండ పోలీసులు.
నల్గొండలోని బొట్టుగూడ ప్రాంతంలో విఠల్ హాస్పిటల్ పక్కన పాత బావి ఉంది. వీధుల్లో తిరిగే ఆవు మేత కోసం వెళ్ళి ప్రమాదవశాత్తూ బావిలో జారి పడింది. పది అడుగుల లోతు కలిగిన పాత బావిలో ఆవు పడిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న నల్గొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి స్పందించారు. వెంటనే పోలీసులు, ఫైర్, మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం జేసీబీల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
ఇతర సిబ్బందితో కలిసి పోలీసులు రెండు గంటలు శ్రమించి ఆవును సురక్షితంగా కాపాడారు. ఆవు సురక్షితంగా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో స్థానికులు, నెటిజన్లు పోలీసులపై ప్రశంస జల్లు కురిపించారు. ప్రజల రక్షణకే కాదు.. మూగ జీవాలను సంరక్షణకు మనసున్న మనషులుగా స్పందిస్తామని పోలీసులు అంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..