మధ్యప్రదేశ్‌లో వంతెనల నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మొన్నటికి మొన్న భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన ఓ రైల్వే వంతెన చర్చనీయాంశం కాగా.. తాజాగా మరో వంతెన తెరపైకి వచ్చింది. భోపాల్‌లోనే పాములా మెలికలు తిరిగే రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆ వంతెనపై ఎనిమిది గంటల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరగడంతో.. వంతెన నిర్మించిన ఇంజినీర్లను, దాన్ని పర్యవేక్షించిన ప్రభుత్వ అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు వాహనదారులు. భోపాల్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు ఈ వంతెన మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ వంతెన నిర్మాణం డీటెయిల్స్ చూద్దాం.
భోపాల్‌లోని సుభాష్ నగర్‌లో రూ. 40 కోట్ల వ్యయంతో ఈ వంతెన నిర్మాణం చేశారు. పాములా మెలికలు తిరిగినట్లు ఉండే రైల్వే ఓవర్ బ్రిడ్జిని చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. ఈ బ్రిడ్జి ఎక్కిన కొన్ని సెకన్లలోనే పలుసార్లు మలుపులు తీసుకోవాలి. మెలికలు ఎక్కువవడంతో తరచు జరుగుతున్న ప్రమాదాలు జరుగుతున్నాయి. మలుపుల దగ్గర నియంత్రణ కోల్పోతున్నామని వాహనదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ స్నేక్ బ్రిడ్జిపై ఈమధ్యే జరిగిన ప్రమాదంలో, డివైడర్‌ను ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. మరోసారి ఓ స్కూల్ వ్యాన్ డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులోని విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో ఈ వంతెన నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిపై మరిన్ని ప్రమాదాలు జరగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వంతెనలు ఇలా నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజధాని భోపాల్‌లో ఐష్‌బాగ్ దగ్గర రూ.18 కోట్ల వ్యయంతో కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించారు. అయితే, అది 90 డిగ్రీల మలుపు కలిగి ఉండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. నిర్మాణ సంస్థ మాత్రం ఆ డిజైన్‌ను సమర్థించుకుంది. సమీపంలో మెట్రో రైల్ స్టేషన్, భూమి కొరత దృష్ట్యా ఇలా నిర్మించడం తప్పితే మరో మార్గం లేదని వివరణ ఇచ్చింది. ఇలాంటి డిజైన్‌లను రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. ఓ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్‌పై విచారణకు ఆదేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి