జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజలో ఈనెల 1వ తేదిన వివాహిత వడ్ల సరోజ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వదిలేసి వెళ్లిపోయిన భర్త, తోడుండే కుమారుడే హత్య చేసినట్లు వెల్లడించారు. ధరూర్ మండల కేంద్రానికి చెందిన వడ్ల రాము అలియాస్ రామాచారికి 2001లో అయిజకు చెందిన సరోజతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. అయితే సాఫిగా సాగుతున్న వీరి కాపురంలో భార్య వివాహేతర సంబంధాలు చిచ్చురాజేశాయి. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబం ఒక్కసారిగా ఆగమాగం అయిపోయింది. భార్య సరోజ వివాహేతర సంబంధాలపై భర్త రాము అనేక సార్లు మందలించాడు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని తరచూ ఆమెను కొట్టేవాడు. అయితే 2009లో తనను అకారణంగా కొడుతున్నాడని భర్తపై ధరూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో రాము కొన్నాళ్లు జైలుకు సైతం వెళ్లాడు. ఆ తర్వాత భార్యతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా ఇద్దరినీ రాజీకి ఒప్పించారు. దీంతో భార్య కోసం ధరూర్ వెళ్లి అక్కడ కాపురం పెట్టాడు.
అయితే అక్కడికి వెళ్లిన తర్వాత సైతం భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. తిరిగి మళ్లీ ధరూర్ లోనూ వివాహేతర సంబంధాలు ప్రారంభించింది. ఇక విషయాన్ని గమనించిన భర్త రాము భార్య సరోజ చెడు ప్రవర్తనలో మార్పు రాలేదని విడిపోయావాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో మరోసారి పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఇద్దరు విడిపోయారు. ఇక కొన్నాళ్ల పాటు పిల్లలతో సరోజ ఉండగా, రాము ఎవరికి వారు వేర్వేరుగా ఉన్నారు. 2012లో తన సమీప బంధువైన సుజాతను రెండో వివాహం చేసుకున్నాడు రాము. కొన్నాళ్ల పాటు బెంగళూరులో జీవనం సాగించారు… వారికి ఇద్దరు పిల్లల సంతానం కలిగారు. తిరిగి భార్య సుజాత స్వగ్రామమైన కర్నూలు జిల్లాలోని కోస్గి గ్రామానికి మకాం మార్చారు అక్కడే కార్పెంటర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే అప్పుడప్పుడు మొదటి భార్య పిల్లలను చూసి వెళ్లేందుకు రాము అయిజకు వచ్చివెళ్తుండేవాడు. ఈ క్రమంలో సరోజ ఇంకా బుద్ధి మార్చుకోలేదని గ్రహించి ఆమెకు నచ్చజెప్పాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. మరోవైపు తల్లి వివాహేతర సంబంధం పెద్దకుమారుడు వినోద్ పెళ్లి సంబంధాలకు అడ్డుగా మారాయి. ఇదే అంశాన్ని వినోద్ తండ్రి రాముకు తెలిపాడు. అయితే ఎన్నిసార్లు చెప్పినా… ఎంత చేసినా సరోజ చెడుప్రవర్తనలో మార్పురాదని గ్రహించి… ఇక ఆమెను చంపెస్తేనే వినోద్ పాటు మరో ఇద్దరు పిల్లల భవిష్యత్ బాగుంటుందని నిర్ణయానికొచ్చాడు రాము. ఈ నెల 1వ తేదిన కర్నూల్ జిల్లా కోస్గి నుంచి ద్రిచక్ర వాహనంపై రాము అయిజ లోని సరోజ నివాసానికి వచ్చాడు. అప్పటికే ఇంట్లో ఉన్న వినోద్ తో కలిసి సరోజతో రాము ఉద్దేశ్యపూర్వకంగా గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సరోజ తలను నేలపై ఉన్న బండకు బలంగా బాదాడు. దీంతో సరోజ తల నుంచి తీవ్ర రక్తస్రావమై పడిపోయింది. ఆమెను ఇంట్లోని మంచంపై పడుకోబెట్టి రాము తలను మంచానికి వత్తిపట్టుకోగా… కుమారుడు వినోద్ తల్లి కాళ్లను కదలకుండా అదిమి పట్టుకున్నాడు. కాసేపటికే సరోజ అక్కడిక్కడే మరణించడంతో ఆమె శరీరంపై బెడ్ షీట్ కప్పి ఘటనాస్థలి నుంచి రాము, వినోద్ ఇద్దరు పరారయ్యారు.
ఇక మృతురాలి సోదరడు నరసింహ ఫిర్యాదుతో అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసిన అయిజ పోలీసులు విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా సరోజను హత్య చేసింది భర్త వడ్ల రాము, కుమారుడు వడ్ల వినోద్ గా తేల్చారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఇక తల్లి మరణం, అప్పుడప్పుడు వచ్చి వెళ్లే తండ్రి, ఇంటికి పెద్దవాడైన సోదరుడు జైలు కెళ్లడంతో మిగతా ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.