జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదర్శనగర్ లో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హతమార్చారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆదర్శనగర్‌లో 5 ఏళ్ళ చిన్నారి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలికపై అత్యాచారం చేసి, హతమార్చినట్లు ఆనవాళ్లు లభించడంతో.. పోలీసులు ఈ కోణంలో విచారణ చేపడుతున్నారు.
ఆదర్శనగర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి ఆరు బయట ఆడుకుంటుంది. శనివారం(జూలై 05) సాయంత్రం నుండి చిన్నారి కనపడక పోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందారు. గంట పాటు వెతికినా ఆచూకీ దొరకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. చివరికి వారి ఇంటి దగ్గరలోని మరో ఇంటి బాత్రూమ్‌లో రక్తపు మడుగులో చిన్నారి పడి ఉంది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన బంధువులు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఐదేళ్ల చిన్నారిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు.
ఈ చిన్నారి తండ్రి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు మాయ మాటలు చెప్పి.. అఘాత్యం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి చుట్టూ పక్కల వారిని విచారిస్తున్నారు. ఇటీవల గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోయాయి. ఆ పరిసర ప్రాంతంలో ఎవరైన సంచరించారోనని.. వారిపై నిఘా పెట్టారు పోలీసులు. ఈ సంఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..