New Delhi: న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ పేరు మార్పుకు బీజేపీ ఎంపీ ప్రతిపాదన.. “ఆ పేరే” పెట్టాలని డిమాండ్!

New Delhi: న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ పేరు మార్పుకు బీజేపీ ఎంపీ ప్రతిపాదన.. “ఆ పేరే” పెట్టాలని డిమాండ్!


దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక అనేక రోడ్ల పేర్లు, నివాసాల పేర్లు,నగరాల పేర్లు మారాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ పేరు మార్చాలన్న డిమాండ్ తెరమీదికి తెచ్చారు చాందిని చౌక్ బిజెపి ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పేరును అటల్ బిహారీ వాజ్‌పేయి రైల్వే స్టేషన్‌గా మార్చాలని అభ్యర్థిస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. ఈ అంశాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సైతం లేవనెత్తుతానంటున్నారు.

వాజ్ పేయ్ పేరే ఎందుకు ?

దేశ రాజదానిలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రధాన కనెక్టివిటీని కలిగి ఉంది. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే, అత్యంత ప్రసిద్ధ రైల్వే స్టేషన్లలో ఒకటి కూడా. ఇలాంటి రైల్వే స్టేషన్ కి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే జాతీయ నాయకుడు, భారతదేశాన్ని ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి , ప్రపంచ స్థాయి కొత్త యుగంలోకి నడిపించిన దార్శనిక నాయకుడు మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టడానికి తగిన ప్రదేశంగా నిలుస్తుందని ఆయన అన్నారు. అందుకే న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వాజ్‌పేయి పేరు పెట్టాలని కోరుతున్నానని తెలిపారు. వాజ్‌పేయి సమ్మిళిత రాజకీయాలు, గౌరవప్రదమైన నాయకత్వం, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత, భారత ప్రజలలో ఆయనకు అపారమైన గౌరవాన్ని సంపాదించిపెట్టాయని ఆయన అన్నారు. ఢిల్లీ వాజ్పేయి రాజకీయ కార్యస్థలం మాత్రమే కాదని, ఆయనకు లోతైన భావోద్వేగ సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ప్రాంతంగా ఖండేల్వాల్ చెప్పుకొచ్చారు.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వాజ్‌పేయి పేరు పెట్టడం.. ఆయన జీవితాంతం దేశానికి చేసిన సేవకు తగిన నివాళి అని, ఇది ప్రజాభిప్రాయాన్ని ప్రతిధ్వనించే చర్య అవుతుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, బెంగళూరులోని క్రాంతివీర సంగోల్లి రాయన్న స్టేషన్ వంటి పేర్లతో ప్రధాన ప్రభుత్వ సంస్థలు, రవాణా కేంద్రాలు ఉన్నపుడు.. దేశానికి గుండెకాయ అయిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ వాజ్‌పేయి స్థాయి కలిగిన నాయకుడిని గౌరవించడానికి సరైనదంటున్నారు. రైల్వే స్టేషన్ పేరు మార్పు వాజ్ పేయి చేసిన అపారమైన కృషికి నివాళి అర్పించడమే కాకుండా, రాజధాని గుండా వెళ్ళే భవిష్యత్ తరాలకు ప్రేరణగా కూడా ఉపయోగపడుతుందంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *