తెలంగాణలో ఆషాడమాసం బోనాల సందడి కొనసాగుతుంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల వీరంగాలు.. ఘటాల ఊరేగింపుతో హైదరాబాద్‌లో నేడు మహంకాళి జాతర ప్రారంభం కానుంది. ఇవే ఉజ్జయిని బోనాలు, లష్కర్ బోనాలుగా పిలుస్తారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్‌రెడ్డి బోనం సమర్పించనున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా 2500మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఈరోజు, రేపు హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్ పెట్టారు. అలాగే, పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
ఆషాడమాసంలో బోనాలు ఇక్కడి స్పెషల్. గోల్కొంట కోటలో బోనాలు ప్రారంభమై… లాల్ దర్వాజతో ముగుస్తాయి. నెల రోజుల పాటు.. హైదరాబాద్ అంతటా బోనాల వేడుక వైభవంగా జరుగుతుంది. ఆషాడ మాస బోనాల్లో గోల్కొండ కోటపైన ఉన్న జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించే సంప్రదాయం కులీకుతుబ్‌షా కాలం నుంచి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఇవాళ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. బోనాల ఉత్సవాలకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు.
జులై 20 ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు భక్తులు. రెండుచోట్ల రంగం కార్యక్రమం ఉంటుంది. రంగంలో మట్టికుండపై భవిష్యవాణి వినిపిస్తారు. జులై 23న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గోల్కొండలో నెల రోజులపాటు ప్రతి గురువారం, ఆదివారం బోనాల సందడి ఉంటుంది. మొత్తం 9 పూజ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సిటీలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి ఆలయాల్లోనూ బోనాలు నిర్వహిస్తారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది దేవాదాయశాఖ. జంటనగరాల్లో బోనాల కోసం 20కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.