Most Expensive Jersey in Cricket History: క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో అత్యంత ఖరీదైన జెర్సీని ధరించడానికి వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టు సిద్ధమవుతోంది. లండన్‌లో జరగనున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నమెంట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ జెర్సీలో 18 క్యారెట్ల బంగారం పొదగబడి ఉంది.
క్రిస్ గేల్, కిరాన్ పొలార్డ్, డీజే బ్రావో వంటి దిగ్గజ ఆటగాళ్లతో కూడిన వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టు, క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. WCL 2025 జులై 18 నుంచి ఆగస్టు 2 వరకు బర్మింగ్‌హామ్, నార్తాంప్టన్, లీసెస్టర్, లీడ్స్‌లో జరగనుంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఆమోదించిన ఈ టోర్నమెంట్, గత తరం క్రికెట్ హీరోలను ఒకచోట చేర్చనుంది.
ఈ ప్రత్యేకమైన జెర్సీని “లోరెంజ్” అనే సంస్థ డిజైన్ చేసింది. ఇది 30 గ్రాములు, 20 గ్రాములు, 10 గ్రాముల గోల్డ్ ఎడిషన్లలో లభించనుంది. ఈ జెర్సీ కేవలం ఒక టీషర్ట్ మాత్రమే కాదని, వెస్టిండీస్ క్రికెట్ గొప్ప చరిత్రకు, దాని దిగ్గజాలకు నివాళి అని లోరెంజ్ వ్యవస్థాపకుడు రాజ్ కరణ్ దుగ్గల్ పేర్కొన్నారు. “ఇది ధరించదగిన చరిత్ర. రాయల్ క్రాఫ్ట్మ్యాన్షిప్, సాంస్కృతిక గర్వం, క్రీడా నైపుణ్యాల కలయిక, లోరెంజ్ జెర్సీ క్రీడలలో విలాసానికి ప్రపంచ చిహ్నంగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి
వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టు యజమాని అయిన ఛానల్2 గ్రూప్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ సేథి మాట్లాడుతూ, “వెస్టిండీస్ ఛాంపియన్స్‌లో అనేక మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జెర్సీ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లందరికీ తగిన నివాళి. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రపంచంలోని ఉత్తమ క్రికెట్ పోటీలలో ఒకటి, ఈ సంవత్సరం ట్రోఫీని గెలవాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం” అని తెలిపారు.
WCL 2025లో క్రిస్ గేల్, డీజే బ్రావో, కిరాన్ పొలార్డ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, సురేష్ రైనా, బ్రెట్ లీ, క్రిస్ లిన్, షాన్ మార్ష్, ఇయోన్ మోర్గాన్, మొయిన్ అలీ, సర్ అలిస్టర్ కుక్, ఏబీ డివిలియర్స్, హషీమ్ ఆమ్లా, క్రిస్ మోరిస్, వేన్ పార్నెల్ వంటి ఎందరో ప్రపంచ స్థాయి దిగ్గజ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్ క్రికెట్ అభిమానులకు గత తరం ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనలను తిరిగి చూసే అవకాశం కల్పించనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..