బిల్డర్ ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులు.. డబ్బు, నగదు సీజ్.. ఆ తర్వాత అసలు ట్విస్ట్

బిల్డర్ ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులు.. డబ్బు, నగదు సీజ్.. ఆ తర్వాత అసలు ట్విస్ట్


అసలు కథలోకి వెళ్తే.. ఢిల్లీలోని వజీరాబాద్‌లో నకిలీ సీబీఐ అధికారులుగా నటించిన దుండగులు ఓ బిల్డర్ ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఇస్రత్ జమీల్ అనే బిల్డర్ ఇంటిపై సోదాల పేరుతో ముగ్గురు దుండగులు ప్రవేశించి, కుటుంబాన్ని బందీగా చేసి రూ. 3 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా.. వారిలో ఒకరు బాధితుడి దూరపు బంధువని గుర్తించారు.

డీసీపీ రాజా బాంఠియా తెలిపిన వివరాల ప్రకారం ఇస్రత్ జమీల్ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో వజీరాబాద్‌లో నివసిస్తున్నాడు. జూలై 10 రాత్రి, తెల్ల చొక్కాలు, నల్ల ప్యాంట్లు ధరించిన ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు ఇస్రత్ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. ఈ ముగ్గురు, తమ ముఖాలు సరిగా కనిపించకుండా వ్యవహరిస్తూ సీబీఐ అధికారులమని చెప్పారు. ఇంట్లో సోదాలకు వారంట్ ఉందని కూడా అన్నారు. వారంట్ చూపమని ఇస్రత్ అడిగినప్పుడు, అతడిని బెదిరించి, బూతులు తిట్టి ఓ గదిలో బందీలుగా మార్చేశారు.

సుమారు రెండు గంటలపాటు కుటుంబాన్ని బందీగా ఉంచిన దుండగులు, ఇల్లు మొత్తం సోదా చేసి, అల్మారా తాళం పగలగొట్టి రూ. 3 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇస్రత్ కుమార్తె స్కూల్ రిజిస్టర్‌పై నకిలీ రసీదు రాసి, సంతకం చేసి దుండగులు పరారయ్యారు. భయాందోళనలో ఉన్న ఇస్రత్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

ఎస్‌ఐ సర్తాజ్ ఖాన్ నేతృత్వంలోని ఢిల్లీ పోలీసు బృందం విచారణ ప్రారంభించింది. సుమారు 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, నిందితులు నకిలీ నంబర్ ప్లేట్‌తో ఉన్న బైక్‌పై వచ్చినట్లు గుర్తించారు. బైక్ అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను కనుగొనగా, అది కరవాల్ నగర్‌కు చెందిన షైనా పేరున ఉన్నట్లు తెలిసింది. ఈ సమాచారంతో, శుక్రవారం నాడు మసూరీ నుంచి షైనా, కేశవ్ ప్రసాద్‌లను, హరిద్వార్ నుంచి వివేక్‌ను అరెస్టు చేశారు.

నేరం వెనుక కారణం
విచారణలో షైనా, కేశవ్ ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కేశవ్ కుటుంబ ఒత్తిడితో హరిద్వార్‌లో దుకాణం ప్రారంభించినట్లు తెలిసింది. షైనాకు గృహస్థ జీవితం కోసం డబ్బు అవసరం ఉండగా, ఇస్రత్ ఇంట్లో ఆర్థిక స్థితి గురించి సమాచారం తెలిసింది. ఆమె కేశవ్‌తో కలిసి ఈ దోపిడీకి ప్లాన్ చేసింది. కేశవ్ తన పొరుగువాడైన వివేక్‌ను కూడా ఈ నేరంలో భాగస్వామ్యం ఇచ్చి కలుపుకున్నాడు. దోపిడీ తర్వాత డబ్బును పంచుకుని, కేశవ్ తన దుకాణం కోసం సామాను కొనుగోలు చేయగా, మిగిలిన డబ్బును హోటళ్లలో ఖర్చు చేశారు.

షైనా కరవాల్ నగర్‌లో నివసిస్తుందని, స్థానికంగా పశుప్రేమిగా గుర్తింపు పొందిందని పోలీసులు తెలిపారు. ఆమె గాయపడిన జంతువులకు చికిత్స చేయడంతో పాటు, స్థానిక పిల్లలకు ట్యూషన్ కూడా చెప్పేది.

కథ అడ్డం తిరిగింది ఇక్కడే

ఇస్రత్ ఇంట్లో సుమారు రూ. 10 లక్షల నగదు ఉంటుందని షైనా భావించింది. కానీ దూరపు చుట్టమైన ఇస్రత్ ఇంటి ఖచ్చితమైన చిరునామా కూడా ఆమెకు సరిగా తెలియదు. గల్లీ నంబర్, మసీదు, లిఫ్ట్, టాప్ ఫ్లోర్ ఫ్లాట్ వంటి సమాచారం ఆధారంగా వారు ఇస్రత్ ఇంటిని గుర్తించి దోపిడీకి పాల్పడ్డారు. సాధారణంగా సీబీఐ, ఐటీ, ఈడీ వంటి విభాగాల అధికారులు పగటి సమయంలో కార్లలో వస్తారు. వారెంట్‌తో పాటు CRPF లేదా స్థానిక పోలీసుల భద్రత నడుమ సోదాలు నిర్వహిస్తారు. అయితే ఈ ముగ్గురూ ఒక బైక్‌పై వచ్చినట్టు సీసీటీవీ కెమేరాల్లో గుర్తించిన వెంటనే పోలీసులు ఇది పూర్తిగా “స్పెషల్ 26” వ్యవహారమని గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు కొనసాగించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ ఘటనతో నకిలీ అధికారుల పేరుతో జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే సైబర్ నేరాలు కూడా ఈ కోవలోనివేనని వెల్లడించారు. ఏదైనా అనుమానాస్పద సందర్శన లేదా కాల్ వస్తే, వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *