
లెజెండరీ అమెరికన్ రెజ్లర్ హల్క్ హోగన్ మరణించాడు. ఆయన కార్డియక్ అరెస్ట్‌తో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఆగస్టు 11, 1953న జార్జియాలోని అగస్టాలో జన్మించిన హల్క్.. రెజ్లింగ్ క్రీడకే ప్రత్యేక వన్నె తెచ్చారు. డబ్ల్యూడబ్ల్యూఈకి ప్రజాదరణ తీసుకురావడంలో హల్క్ తీవ్రంగా కృషి చేశారు. 1983లో వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్‌లో చేరడంతో ఆయన కెరీర్ ఒక గొప్ప టర్న్ తీసుకుంది. ఆండ్రీ ది జెయింట్, మాకో మ్యాన్ రాండీ సావేజ్, అల్టిమేట్ వారియర్ వంటి గొప్ప రెజ్లర్‌లతో చారిత్రాత్మక మ్యాచ్‌లలో పోటపడ్డారు. హల్క్ ఆరు సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌గా నిలిచారు. హల్క్ హ్యాండిల్ బార్ మీసాలతోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.
హోగన్ 2005లో డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. 1984లో మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ది ఐరన్ షేక్‌ను ఓడించడం ద్వారా హొగన్ తన మొదటి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. ఈ విజయంతో హల్క్‌మానియా” ప్రారంభమైంది. రెజ్లింగ్‌తో పాటు హోగన్ పలు సినిమాల్లో నటించారు. నో హోల్డ్స్ బారెడ్, సబర్బన్ కమాండో, మిస్టర్ నాన్నీ వంటి సినిమాల్లో నటించారు. టీవీ షోలలోనూ పాల్గొన్నాడు. హల్క్‌కు ఇండియాలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హల్క్ మరణవార్తను డబ్ల్యూడబ్ల్యూఈ ధ్రువీకరించింది. డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఒకడైన లెజెండరీ రెజ్లర్‌ను కోల్పోయామని సంతాపం తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.