ఇంట్లో కరివేపాకు చెట్టు పెంచడం సులువే అనుకుంటే పొరపాటే. పురుగులు పట్టకుండా, ఏపుగా పెరగాలంటే సరైన జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని సులువైన చిట్కాలను పాటిస్తే, కరివేపాకు చెట్టు తాజాగా, ఆరోగ్యంగా పెరిగి, వంట సమయానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
మజ్జిగను ఎరువుగా వాడండి: ఏ మొక్క అయినా బాగా పెరగాలంటే సరైన ఎరువు చాలా అవసరం. కరివేపాకు చెట్టు ఏపుగా పెరగాలంటే మజ్జిగను ఎరువుగా వాడటం ఒక మంచి చిట్కా. మజ్జిగ ఒక సహజసిద్ధమైన ఎరువులా పనిచేస్తుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ మట్టిలో ఆమ్లత్వాన్ని పెంచి, మొక్కలకు పోషకాలు సరిగా అందేలా చేస్తుంది. మజ్జిగను నేరుగా మట్టిలో పోయవచ్చు లేదా ఆకులపై స్ప్రే చేయవచ్చు. కంపోస్ట్ ఎరువులో కొద్దిగా మజ్జిగ కలిపితే దాని ప్రభావం మరింత పెరుగుతుంది. మజ్జిగలోని మంచి బ్యాక్టీరియా మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కొమ్మలను కత్తిరించడం (మండలు విరవడం): కరివేపాకు చెట్టును ఆరోగ్యంగా పెంచడానికి ఇది చాలా ముఖ్యమైన చిట్కా. మధ్యమధ్యలో కరివేపాకు కొమ్మలను (మండలను) కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చెట్టు సరైన విధంగా ఎదిగేందుకు, కొత్త చిగుళ్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. పోషకాలు అందక పాడైపోయిన లేదా విరిగిపోయిన కొమ్మలను వెంటనే తీసేయాలి. దీనివల్ల అవి గాలికి ఊగి వేర్లను దెబ్బతీయకుండా ఉంటాయి. అంతేకాకుండా, పురుగులు లేదా ఇన్ఫెక్షన్ సోకిన భాగాలను వెంటనే తొలగిస్తే, అది చెట్టులోని మిగతా భాగాలకు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.
వేప నూనె వాడకం: మొక్కలకు పురుగులు పట్టడం, ఇన్ఫెక్షన్లు రావడం సహజం. కరివేపాకు చెట్టు త్వరగా పాడైపోవడానికి ప్రధాన కారణం ఈ పురుగులే. వీటికి వేప నూనె ఒక అద్భుతమైన సహజసిద్ధమైన పరిష్కారం. వేప నూనెను నేరుగా వాడకుండా, నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌తో ఆకులపై, కాండంపై పిచికారీ చేయాలి. వేప నూనెలో ఉండే ‘అజాడిరక్టిన్’ అనే రసాయనం వివిధ రకాల తెగుళ్లు, పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. ఇది మొక్కకు ఎలాంటి హాని చేయకుండా, ఆరోగ్యంగా పెరగడానికి తోడ్పడుతుంది.
సరైన మట్టి ఎంపిక: మొక్కల పెంపకంలో నీరు, ఎరువు ఎంత ముఖ్యమో, ఎలాంటి మట్టిని వాడుతున్నామనేది కూడా అంతే కీలకం. కరివేపాకు చెట్టు బాగా పెరగాలంటే, నీటిని ఎక్కువగా గ్రహించి, వేర్ల వరకూ నీరు చేరేలా ఉండే మట్టిని ఎంచుకోవాలి. ఇలాంటి మట్టి ఎక్కువ కాలం తేమను పట్టి ఉంచుతుంది. మట్టి కణాలు కాస్త దూరంగా ఉండటం వల్ల నీరు, గాలి సరిగా ప్రవహిస్తాయి. నీరు పోసేటప్పుడు ఒకేసారి భారీ మొత్తంలో కాకుండా, అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా పోయాలి.
తగినంత సూర్యరశ్మి: కరివేపాకు చెట్టు ఆరోగ్యంగా, ఏపుగా పెరగాలంటే సూర్యరశ్మి చాలా అవసరం. చెట్టును ఎక్కడ ఉంచుతున్నారనేది ముఖ్యం. కనీసం 6 గంటల పాటు సూర్యరశ్మి తగిలే చోట చెట్టును పెంచాలి. సూర్యరశ్మి సరిగా తగలకపోతే చెట్టు త్వరగా పాడైపోతుంది. తగినంత సూర్యరశ్మి లభించినప్పుడే మొక్కలు గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేసి, వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.