ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 లో వేరే జట్టు తరఫున ఆడేందుకు తాను సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ను విడిచిపెట్టినట్లు వస్తున్న పుకార్లపై భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్పందించాడు. తాను ఎల్లప్పుడూ తన జట్టుకు అండగా నిలుస్తానని, వారి తరఫున ఆడుతూనే ఉంటానని క్లారిటీ ఇచ్చేశాడు.
ఎస్ఆర్హెచ్ను వీడి వేరే టీమ్‌కి వెళ్లిపోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా నితీష్ రెడ్డి గురించి వార్తలు వస్తున్నాయి. ఇటీవలె మోకాలి గాయంతో ఇంగ్లాండ్‌తో చివరి రెండు టెస్టులకు దూరం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్తో విభేదాలతోనే జట్టును వీడుతున్నాడంటూ పుకార్లు వచ్చాయి. టీమ్‌లో తన పాత్ర పట్ల అసంతృప్తిగా ఉన్నాడని, ముఖ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నాడని, అందుకే టీమ్ మేనేజ్మెంట్ ఒప్పుకోవడం లేదని నితీష్ అన్ హ్యపీగా ఉన్నాడని పుకార్లు వచ్చాయి. అందుకే జట్టును వీడుతున్నాడనే ప్రచారం జరిగింది.
దీనిపై స్పందించిన నితీష్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ.. “నేను అనవసరపు విషయాలకు దూరంగా ఉంటాను, కానీ కొన్ని విషయాలకు స్పష్టత అవసరం. SRH తో నా సంబంధం నమ్మకం, గౌరవం, సంవత్సరాల ఉమ్మడి అభిరుచిపై నిర్మించబడింది. నేను ఎల్లప్పుడూ ఈ జట్టుకు అండగా నిలుస్తాను.” అని పేర్కొన్నాడు. ఈ స్టేట్మెంట్తో నితీష్ కుమార్‌రెడ్డి ఎస్ఆర్హెచ్ను వీడి పోవడం లేదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.
కాగా IPL 2025 లో నితీష్ రెడ్డి అంత గొప్పగా రాణించలేదు. అతను బ్యాట్, బాల్‌తో ఇబ్బంది పడ్డాడు, 13 ఇన్నింగ్స్‌లలో కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. 2023 లో ఫ్రాంచైజీతో తన IPL అరంగేట్రం చేసిన నితీష్ IPL 2024 లో అతని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 303 పరుగులు చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. 2025లో అతనిపై భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ వాటిని అందుకోలేకపోయాడు.
I tend to stay away from the noise, but some things deserve clarity. My connection with SRH is built on trust, respect, and years of shared passion.
I’ll always stand by this team. 🧡— Nitish Kumar Reddy (@NKReddy07) July 27, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి