చిప్స్ అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నోరూరుతుంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే.. బంగాళాదుంపలతో చేసిన చిప్స్ మంచివా..? లేక అరటిపండుతో చేసిన చిప్స్ మంచివా..? అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అరటిపండు చిప్స్
ఈ చిప్స్ కేరళలో చాలా ఫేమస్. ఇవి నెంద్రం అరటికాయలతో (పచ్చివి) చేస్తారు. ఈ అరటికాయలను సన్నని ముక్కలుగా కట్ చేసి కొబ్బరి నూనెలో వేయిస్తారు. వేగిన తర్వాత పైన కొద్దిగా ఉప్పు లేదా మసాలా చల్లుతారు. ఈ చిప్స్‌కు ప్రత్యేకమైన రుచి ఉంటుంది.. ఇందులో తీపి, ఉప్పు రుచులు కలిసి ఉంటాయి. అంతేకాదు ఇవి కరకరలాడుతూ ఉంటాయి. వాటి సహజమైన వాసన ఈ చిప్స్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.
బంగాళాదుంప చిప్స్
బంగాళాదుంపలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడే పదార్థాలలో ఒకటి. వీటిని కూడా సన్నగా తరిగి నూనెలో వేయించి పైన వివిధ రకాల ఫ్లేవర్స్.. ఉప్పు, స్పైసీ, చీజ్ లాంటివి కలుపుతారు. వీటికి ఎక్కువ రుచి ఉండటం వల్ల పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఎక్కువగా తింటే ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
రుచి తేడాలు
అరటిపండు చిప్స్‌లో కొబ్బరి నూనె వాడటం వల్ల ప్రత్యేకమైన వాసన ఉంటుంది. అలాగే తీపి ఉప్పు రుచులు కలిసిపోతాయి. బంగాళాదుంప చిప్స్ మాత్రం రుచుల్లో చాలా రకాలుగా దొరుకుతాయి.. పలు రకాల ఫ్లేవర్ లలో లభిస్తాయి. అయితే రెండింటినీ తినేటప్పుడు వాటిలో వాడిన నూనె ఉప్పు స్థాయిలను గమనించాలి.
షుగర్ ఉన్న వాళ్లకు సూచన
షుగర్ ఉన్నవాళ్లు వీలైనంత వరకు అరటిపండు చిప్స్ వైపు మొగ్గుచూపాలి. ఎందుకంటే అరటిపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ వేగంగా పెరగవు. అదే సమయంలో బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో షుగర్ ఎక్కువగా పెరిగే అవకాశముంటుంది.
ఆయిల్ ఎంపికతో ఆరోగ్యం
ఏ నూనె వాడారన్నది చాలా ముఖ్యమైన విషయం. అరటిపండు చిప్స్ ఎక్కువగా కొబ్బరి నూనెతో చేస్తారు.. ఇది సహజమైన కొవ్వు. కానీ బంగాళాదుంప చిప్స్‌లో ఎక్కువగా రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం వల్ల అవి ఆరోగ్యానికి మంచివి కావు. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం లాంటి సమస్యలు వస్తాయి.
అరటిపండుతో ఆరోగ్యానికి లాభాలు
అరటిపండులో సహజంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో సాయం చేయడమే కాదు.. కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. బంగాళాదుంపల్లో ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల త్వరగా ఆకలిగా ఉంటుంది. అలాగే పొటాషియం అరటిపండులో ఎక్కువగా ఉంటుంది.. ఇది గుండెకు మంచిది.
గుండెకు ప్రమాదం జాగ్రత్త
చిప్స్‌లోని ఉప్పు స్థాయి ఎక్కువైతే రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అరటిపండు చిప్స్ సాధారణంగా తక్కువ ఉప్పుతో తయారు చేస్తారు. కానీ బంగాళాదుంప చిప్స్‌లో ఎక్కువగా ఉప్పు కృత్రిమ రుచి పదార్థాలు ఉండే అవకాశముంటుంది.
ఏది ఎంచుకోవాలి..?
రుచిలో చూసుకుంటే బంగాళాదుంప చిప్స్ చాలా రకాలుగా దొరుకుతాయి. కానీ ఆరోగ్యపరంగా చూస్తే అరటిపండు చిప్స్ మితంగా తీసుకుంటే మంచివే. పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల శరీరానికి మేలు చేస్తాయి. అయితే ఏ చిప్స్ అయినా మితంగా తీసుకోవడమే ఉత్తమం.
ఈ చిప్స్‌ను మనం రోజూ తినే అలవాట్లలో చేర్చుకుంటే చాలా మంచిది. బయట షాపుల్లో దొరికే ప్రాసెస్డ్ చిప్స్ కన్నా.. ఇంట్లో చేసుకున్న అరటిపండు చిప్స్ ఎంచుకోవడం ఉత్తమం. మంచి నూనెతో, తక్కువ ఉప్పు వేసి ఈ చిప్స్‌ను వేయిస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, రుచికి రుచి ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)