విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్ డమ్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా సోమవారం (జులై 28) రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో పాటు చిత్ర బృందమంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కింగ్ డమ్ సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ తెలుగులో మాట్లాడి ఆహూతులను అలరించాడు. హుషారైన పాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అతను కింగ్ డమ్ ఈవెంట్ లో తన పవర్ ఫుల్ స్పీచ్ తోనూ అదరగొట్టాడు.
‘తెలుగు సినిమాల పరంగా నా మెంటర్ నాగవంశీ గారు. నా సాంగ్ హిట్ అయితే ఆయన చాలా హ్యాపీగా ఫీలవుతారు. ‘కింగ్డమ్’ లాంటి గొప్ప సినిమాలో నన్ను భాగం చేసిన నాగవంశీ గారికి, సితార ఎంటర్టైన్మెంట్స్ టీమ్ కి నా కృతఙ్ఞతలు. సోదరుడు గౌతమ్ దర్శకత్వం వహించిన ‘జెర్సీ’ చిత్రానికి ఎందరో అభిమానులు ఉన్నారు. ‘కింగ్డమ్’ అంతకుమించిన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా విడుదల కోసం మేమందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ అద్భుతంగా నటించారు. ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ ఎడిటర్స్ లో నవీన్ నూలి ఒకరు. విజయ్ చాలా మంచి మనిషి. ఇతరుల యోగక్షేమాల గురించి ఆలోచిస్తాడు. నేను ఈ చిత్రం కోసం పని చేస్తున్న సమయంలో.. ‘మనకి నిద్ర అనేది ముఖ్యం, తగిన నిద్ర పోతూ విశ్రాంతి తీసుకుంటున్నావని ఆశిస్తున్నాను’ అని విజయ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అంత గొప్పది విజయ్ మనసు. నేను ‘కింగ్డమ్’ చిత్రం చూశాను. ఈ సినిమా విజయ్ కెరీర్ తో పాటు, నా కెరీర్ లో, గౌతమ్ కెరీర్ లో, నాగవంశీ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుంది. ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ‘కింగ్డమ్’ ద్వారా మేము తెలుగు ప్రేక్షకుల కోసం ఓ కొత్త ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను. నా కెరీర్ ప్రారంభం నుంచి నా పాటలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మీ వాడిగా భావించి నాపై ప్రేమ కురిపిస్తున్నారు. మీ ప్రేమకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.” అన్నారు…’ అంటూ తెలుగులో స్పీచ్ అదరగొట్టారు అనిరుధ్.