పాఠశాలకు చెందిన ఖాళీ స్థలంలో స్వయంగా వరి పంట సాగు చేసేందుకు విద్యార్థినులు ఉత్సాహంగా నాట్లు వేశారు. పదవ తరగతి, ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న బాలికలు రెండు బృందాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణంలోని 28 గుంటల ఖాళీ స్థలాన్ని ఇప్పటికే చదును చేసి, దుక్కులు దున్ని, నీటిని సరిగా పారించి, వరి నాట్లకు సిద్ధం చేశారు. జిల్లాలో మరెక్కడా లేని విధంగా ఈ బాలికలు ప్రతి ఏడూ కొత్త రకాల పంటలు పండిస్తూ ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
గతంలో పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.. బాలికల కృషిని చూసి స్వయంగా గ్రీన్ పాలిహౌస్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. అందులో సేంద్రీయ కూరగాయలు పండించాలంటూ సూచించారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈసారి బాలికలు వరి నాట్ల కార్యక్రమాన్ని చేపట్టారు. రసాయన ఎరువులకు బదులుగా, పాఠశాలలోనే తామే తయారు చేసిన సేంద్రీయ మందులతో పంటలు పండించాలనే లక్ష్యంతో వ్యవసాయాన్ని కొనసాగిస్తామని బాలికలు చెబతున్నారు.
చాలా పాఠశాలల వద్ద అనువైన వాతావరణం, ప్రహరీ గోడలు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఖాళీ స్థలాలు వృథా అవుతున్నాయి. ప్రభుత్వం పెరటి సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నా, అనేక చోట్ల ప్రధానోపాధ్యాయులు పట్టించుకోకపోతున్నారు. అయితే ఎడపల్లి గురుకుల పాఠశాల విద్యార్థినులు మాత్రం కూరగాయలతో పాటు వరి పంటను సాగుచేస్తూ మిగతా పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగ శంకర్, వ్యవసాయ విభాగం ఇన్‌చార్జి ఉపాధ్యాయుడు రాజు నిఖార్సైన పర్యవేక్షణతో నిర్వహించారు. విద్యార్థినుల ఈ కృషి, భవిష్యత్ తరాలకు వ్యవసాయంపై ఆసక్తిని కలిగించడమే కాకుండా, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుతుందని పలువురు అభినందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.