Our Diet Is Our Destiny సంపూర్ణ ఆహారమే సర్వవ్యాధినివారణ

Our Diet Is Our Destiny సంపూర్ణ ఆహారమే సర్వవ్యాధినివారణ

Our Diet Is Our Destiny సంపూర్ణ ఆహారమే సర్వవ్యాధినివారణ: (ఆహారము – పోషకవిలువలు, పథ్యాపథ్యములు)వేదాల్లో ఆహారము

ఆహారము: సృష్టిలోని ప్రాణమున్న ప్రతి ప్రాణికి ఆహారము కావాలి. ఆహారము మానవుడి పుట్టుకకు, శరీరములోని ప్రతి అవయవ నిర్మాణానికి, ఎదుగుదలకు కారణమైనది. చక్కని అవయవ నిర్మాణానికి, ఆరోగ్యానికి, అతి చక్కని ఆలోచనలకు మరియు దేశాభివృద్ధికి కారణమయ్యేది కూడ ఆహారమే. శ్రమను తట్టుకునే శక్తిని, కష్టించి పనిచేసే సామర్ధ్యాన్ని, రోగనిరోధకశక్తిని పెంపొందించేది ఆహారమే. మనము సేవించే ఆహారమే మన భాగ్యవిధాత అనటములో అతిశయోక్తిలేదు.

మన పురాణాలలో, వేదాలలో, ఉపనిషత్తుల్లో మరియు హిందువులు అత్యంత భక్తితో పఠించే మన పురాణాలలో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో మరియు హిందువులు అత్యంత భక్తితో పఠించే మహాభారతములో కూడ ఆహారము యొక్క ప్రాధాన్యత గురించి వివరించబడినది. మన పూర్వజులు ఆహారాన్ని అపురూపమయినదిగా భావించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ఆస్వాదించేవాళ్ళు మరియు సేవించి ఆనందించే వాళ్ళు.

శుక్లయజుర్వేదము నందు ఆహారము గురించి వివరిస్తూ ఆహారాన్ని ముందుగా దేవతలకు నైవేద్యంగా సమర్పించి “ఓ పూర్వజులారా! మేము సమర్పించు బలకరమైన పాలను (క్షీరము), ఘృతము (నెయ్యి)ను, ఖండ శర్కరను, అతిచక్కని సువాసనలు వెదజల్లు ఫలాల (పండ్ల)ను మరియు అతి పరిశుద్ధమైన జలము (నీరు)ను స్వీకరించండి. అని ప్రార్ధించి తదనంతరము స్వీకరించేవారు.

అధర్వణ వేదమునందు “ఓ దేవతలారా! మేము కల్సి భుజించునట్లు, కల్సి జీవించునట్లు, ఎలాంటి ద్వేషము, ఈర్ష్య, అసూయ భావములు లేకుండా అహంకారానికి లోను కాకుండ చక్కని సంతోషాన్ని ప్రశాంతతను కలిగించండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పబడింది. తైత్తరీయ ఉపనిషత్తు యందు అన్నము పరబ్రహ్మమని జీవనానికి ఆధారభూతమైనదిగా పేర్కొనబడినది. చందోగ్యోపనిషత్తునందు ఆహారము, దానియొక్క ప్రాధాన్యతలు, అది శారీరక మానసిక స్థితులపై చూపించు ప్రభావాల గురించి వివరించబడినది. మనుస్మృతి యందు కూడ ఆహార ప్రాధాన్యత గురించి వివరించబడినది. ఆహారాన్ని అపురూపంగా భావించాలి. కీర్తించాలి. ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కించపరచకూడదు. భక్తితో స్వీకరిస్తే శరీరానికి బలాన్ని, శక్తిని కలిగిస్తుంది. దాన్ని నిందిస్తూ స్వీకరిస్తే బలహీనతను కలిగించి శక్తి హీనంగా నిస్సారతకు కారణమవుతుంది అని పేర్కొనబడింది.

కాశీరాజయిన వామకుడు పేర్కొన్నట్లు చక్కని ‘సమ్యక్ ఆహారము’ ప్రాణుల ఎదుగుదలకు తోడ్పడునని, అసంతులిత ఆహారము వ్యాధులు కలగటానికి కారణమౌతుందని పేర్కొనెను. భగవద్గీత యందు కూడ ఆహారమునకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆహారము సాత్త్విక, రాజసిక, తామసికములుగా వర్గీకరించెను. మనము సేవించే ఆహారము వలననే ప్రకృతులు ఏర్పడునని భావము. అలాగే బైబిల్, ఖురాన్ గ్రంథములందు కూడా ఆహార ప్రాధాన్యతల గురించి వివరించబడినది. ఆధునిక వైద్యానికి మూల పురుషులు మరియు హిపోక్రటిస్ సైతము తన రోగులు ఏ రకమైన ఆహారాన్ని సేవించాలో వివరించినట్లు చారిత్రక సాక్ష్యాలు కలవు.

ఆహారము – ఆయుర్వేదము Our Diet Is Our Destiny సంపూర్ణ ఆహారమే సర్వవ్యాధినివారణ

ఆచార్య చరకుడు “ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యములను మూడు ఉపస్తంభము లందురని, చక్కని సమ్యక్ ఆహారము వలన బలము, వర్ణము, పుష్టి కలుగునని పేర్కొనెను (చ.సూ. 11.35) చక్కని అనుకూలమైన వర్ణము, గంధము, రసము, స్పర్శము కలిగినట్టియు, విధిప్రకారముగా ఉపయోగించునట్టి అన్నపానములు మనస్సును చక్కగా ఉంచును. శరీరాన్ని వృద్ధిపరచును. శరీరమునందలి ధాతు సమూహములకు బలము, వర్ణము కలిగించును. ఇంద్రియములకు నిర్మలత్వమును కలిగించును. ఆహారాన్ని శాస్త్రవిధిగా సేవించకున్న అహితము/ అనారోగ్యము (Dis- ease) ను కలిగించును. ఆచార్య సుశ్రుతుడు “ఆహారము వలననే శరీరము పుడుతుందని, బలమునకు, వర్ణమునకు మరియు ఓజస్సునకు కారణమౌతుందని 3. (.. 46.3)

ఆచార్య చరకుడు ఆహార ప్రాధాన్యతను గురించి వివరిస్తూ:

“ఆహార సంభవం వస్తు: హితా హిత విశేషాచ్ఛ రోగశ్చాహార సంభవాః విశేషః సుఖదుఃఖయో” (చ.సూ) మానవశరీరము ఆహారము వలననే జనిస్తుంది. శరీరానికి వచ్చే రోగములు Diseases) అపథ్యకర ఆహారము సేవించుటవలననే కలుగుతాయి.

హితమైన భోజనము:

“విశిష్ట మిష్ట సంస్కారైః పధైరిఫై రసాధిఖః మనోజ్ఞం శుచి నా తుష్టం (ప్రత్యగ) మతనము హితమ్” (సు. సూ. 38) అనుకూలమైన విశిష్టమైన సంస్కారములతో కూడి ఉండునది, పధ్యములై ఇష్టమైన రుచులతో కూడి ఉండునది మనోహరంగా ఉండి శుచి శుభ్రత కలిగి ఎక్కువ వేడిగా ఉండునదియు, ఎప్పటికప్పుడు తాజాగా ఉండునదిగా ఉండు ఆహార పదార్ధములు హితంగా ఉంటాయి. ఇక భోజనము చేయునపుడు మధ్య మధ్యలో నీటిని త్రాగాలి. దీనివలన నాటుక శుద్ధమగును, తిరిగి భుజించు ఆహారము క్రొత్తదానివలే ఎక్కువగా రుచిగా ఉండును. (సు.సూ)

స్వాధుభోజన ప్రయోజనము :

నోటికి రుచించు భోజనము చేసినపుడు మనస్సునకు తృప్తి, శరీరబలము, శరీరపుష్టి, ఉత్సాహము, హర్షము, సుఖము అను వానిని కలిగించును. స్వాధువుకాని భోజనము విపరీత గుణములను కలిగించును.

సేవించకూడని ఆహారము:

అశుచిగా ఉండునది, వెంట్రుకలు, పురుగులతో కూడినట్టిది, ఇతరులు తిని వదిలివేసినది, రాళ్ళు, మట్టిపెళ్ళలు, గడ్డిపరకలు కలిగినట్టియు, రంగు, రుచి మారినది, చెడు వాసన వేయు ఆహారము, కుళ్ళి, పాచిపోయిన ఆహారము తినకూడదు. అలాగే బాగా మాడిపోయినది, గడ్డకట్టినది, చల్లారిపోయిన ఆహారాన్ని కూడ సేవించరాదు.

భోజన పరిమాణము:

పొట్టలో సగభాగము అన్నముతో, 1/4 భాగము నీటితో నింపి, మిగిలిన 1/4 భాగము వాతాదులు సంచరించడానికి ఖాళీగా వదిలివేయాలి. అంతేకాని పీకలదాకా భుజించటము ఎప్పుడూ మంచిదికాదు.

ఆహారమాత్ర:

ఆహారమును ప్రమాణమును అనుసరించి సేవించాలి. ప్రమాణము (Quantity of food) గా సేవించే ఆహారము జఠరాగ్ని (Digestive fire)ని బలంగా ఉంచుతుంది. గురుగుణము (Heavy food)కల పదార్థములను సగము పొట్టనిండువరకు, లఘుగుణము (Light foods) తేలికగా జీర్ణమగు ఆహారము) సామాన్యంగా తృప్తికలిగేవరకు భుజించాలి. శరీర బలానికి మూలమైనది జఠరాగ్ని (Digestive fire). జీవితమునకు బలము మూలము. బలానికి ఆహారము మూలం. కావున భుజించిన ఆహారము మరుసటి (Next diet) అన్నకాలమునకు చక్కగా జీర్ణమయి. తిరిగి ఆకలివేయునో అదియే ఆహారమాత్ర లేదా ఆహార ప్రమాణము.

ఆహారాన్ని అధికంగా భుజిస్తే :

ఆహారాన్ని ఎక్కువగా భుజించిన సమస్త దోషములను పుట్టించును. దీని వలన శరీరము బరువుగా, ఆయాసంగా అనాసక్తిగా ఉండును. ఇంతేకాక అలసకము, విశూచి అనే వ్యాధులు కలుగుతాయి.

అతి తక్కువగా భుజిస్తే:

అతి తక్కువగా భుజించిన తృప్తి కలుగదు. బలము, శక్తి, పుష్టి మరియు ఓజోవృద్ధి కలుగదు. పైపెచ్చు సమస్త వాత రోగములకు కారణమౌతుంది.

భోజన కాలము :

మలమూత్రములు విసర్జించబడి హృదయం తేలికగా ఉండి దోషములు తమ తమ మార్గములలో సంచరించుచూ త్రేన్పులు శుద్ధముగా ఉండి ఆకలి వేయుచూ శరీరము తేలికగా ఉండి ఇంద్రియములు చక్కగా పనిచేయుచున్న స్థితినే భోజనమునకు తగిన కాలముగా గమనించాలి. ఇది సుమారు 11 గంటలు (లేదా 12 గంటలు) భోజనమునకు తగిన కాలముగా గమనించాలి. రాత్రి 9 గంటల సమయములోను సంభవిస్తుంది. సకాలములో ఆకలి వేయకపోవటము లేదా ముందుగానే ఆకలి కావటము కూడ ఆరోగ్యలక్షణములు కావు.

భోజన నియమమందలి ప్రయోజనము :

భోజనమును సరి యైన సమయానికి సేవించాలి. సరియైన సమయమున సేవించిన ఆహారము ప్రీతిని (ఇష్టాన్ని) కలిగిస్తుంది. మనకు సాత్మించినది భుజించిన యెడల ఇబ్బంది పెట్టదు. తేలికగా ఉన్నయెడల తొందరగా జీర్ణమౌతుంది స్నిగ్ధంగా వేడిగా ఉన్న భోజనము తిన్న యెడల బలమును వహ్ని బలమును కలిగించును.భుజించిన ఆహారము సమంగా పాకము నొందును. ద్రవపధికంగా ఉన్న ఆహారమును భుజించిన సుఖముగా జీర్ణమగును, తగిన ప్రమాణములో భుజించిన ధాతుసామ్య మును కలిగించును. (సుశ్రుత. సూత్ర)

భోజనమునకు నియమిత కాలము లేకుండ భుజించిన శరీరము తేలికగా ఉండకపోవటము అనేక రకమైన ఇబ్బందులు రావటము జరుగుతుంది. కడుపులో మంట, పుల్లటి త్రేన్పులు (ఎసిడిటి అధికము) కావటము మనకు తెల్సిందే. భోజనం లేటుగా చేస్తే కడుపు అసౌకర్యంగా ఉండటము, ఆహారం సరిగా జీర్ణము కాకపోవ టము, మంట, గొంతుమంట, ఛాతిమంట, ఆహారమునందు అయిష్టత మొదలగునవి కలుగుతాయి.

ఆహార ప్రతిబంధకాలు

ఇతరులకు కీడు తలపెట్టాలి అనే ఆలోచన. ఓర్వలేనితనం, భయం, కోపము, లోభ గుణాలు, రోగము, ద్వేషబుద్ధి కలవారికి సకాలములో భుజించిన ఆహారము కూడ జీర్ణము కాదు.

అజీర్ణమునకు కారణములు

అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని త్రాగిన అకాలము నందు భుజించిన ఎక్కువ ఆకలి అయినప్పుడు భుజించకపోయిన విరుద్ధాహారములను భుజించిన వాతము మలమూత్ర వేగములను అడ్డగించిన సకాలములో నిద్రించకపోయిన కూడా ఆహారం జీర్ణంకాదు, ఇవన్నియు అజీర్ణమునకు కారణములు.

ఆమా జీర్ణ లక్షణములు

భుజించిన ఆహారము తీపి రుచి కలిగి ఆమాశయము (Stomach) లోనే నిలిచి పోయిన అది ఆమా జీర్ణము. పుల్లటి రుచి కలిగి పిత్తకోశసమీపమున నిలిచి ఉండునది. విదగ్ధా జీర్ణము. కొంత పాకమునొంది చిన్న ప్రేగులలోనికి పోయి అచ్చట వాత ప్రకోపం నొంది ఎక్కువ పోటు కడుపునొప్పితో కూడినది విశబ్దా జీర్ణము చక్కగా త్రేన్పులు వచ్చుచున్నను అన్నము నందు ఇష్టము లేక గుండె బరువుగా ఉండి నోట నీరూరుచుండిన అది రసశేషాజీర్ణము అనబడును.

అజీర్ణ ఉపద్రవములు

ఆహారమును పరిమాణంగా ఆహారవిధి ననుసరించి భుజించాలి. ఆహారాన్ని స్వేచ్ఛగా పద్ధతి లేకుండా భుజించిన నాలుగు రకాల అజీర్ణములు కలుగుతాయని తెల్చుకున్నాం కదా! అజీర్ణమునకు సకాలములో ప్రతిక్రియ చేయకపోయిన ఉపేక్షించిన వాంతి, నోట నీరూరుట, శరీరము అదరుట, తల తిరుగుట అసంబద్ధంగా మాట్లాడుట, మూర్ఛ అను లక్షణములు కలుగుతాయి.

ప్రతిదినము సేవించతగిన ఆహార పదార్ధములు

షష్ఠిధాన్యము, శాలిధాన్యము పెసలు, సైంధవ లవణము, ఉసిరికాయలు, బార్లీ అకాశోదకము (వర్షపు నీరు) పాలు, నెయ్యి, జాంగల మాంసము తేనె ఇవి అభ్యసించవలసిన పదార్థములు.

ప్రతిదినము సేవించ తగని ఆహార పదార్థములు

ఎండిన మాంసము, ఎండింపబడిన కూరలు, తామర దుంపలు, తామరతూండ్లు ఇవి గురు గుణము కలవగుట వలన ప్రతిదినము అభ్యసింపకూడదు. కృశించి బక్కచిక్కిన జంతువుల యొక్క మాంసము కూర్చికము కిలాటము.పందిమాంసము, గేదె మాంసము, చేపలు, మినుములు, పెరుగు, యవక అనేధాన్యము మొ||నవి నిత్యము అభ్యసించ కూడదు.

భోజనం చేసిన వెంటనే తినకూడననివి

భుజించిన వెంటనే గురుగుణము (Heavy food substances) గల పదార్థములు,గోధుమ పిండితో, బియ్యపు పిండితో చేయబడిన పదార్థములు, అటుకులు మొదలగువానిని ఎప్పుడూ భుజించకూడదు. ఒకవేళ ఆకలివేస్తే మాత్రమే కొద్దిగా పరిమితిగా తినవచ్చు.

నోటియందు ఉంచుకోదగిన సుగంధ ద్రవ్యములు

నోటియందు నిర్మలత్వమును రుచిని సుగంధమును కోరు మానవులు జాజి కాయలు, లతాకస్తూరికాయలు, పోకవక్కలు, లవంగములు, కంకోలములు, తమల పాకులు, పచ్చకర్పూరము, సన్నయేలకులు మొదలగు వానిని నోటి యందు ఉంచుకో వలయును.(చరక. సూత్ర – 5 అధ్యాయము)

Our Diet Is Our Destiny సంపూర్ణ ఆహారమే సర్వవ్యాధినివారణ