అక్కడ బస్టాండ్ లో బస్సు ఆగితే అంతే సంగతులు. నిత్యం రద్దీగా ఉండే ఆ బస్టాండ్ నే దొంగలు చోరీలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేసుకున్నారు. ఆగిన బస్సు దిగి ఐదు, పది నిమిషాల్లో ఏదైనా తినడానికి తెచ్చుకుని వచ్చేస్తామనుకుంటే పొరపాటే..! అక్కడ ప్రయాణికుల నగదు, బంగారం, వస్తువులు ఏవైనా సరే ఇట్టే మాయం చేస్తున్నారు చోరులు. పోలీసులు, ప్రయాణికుల పర్యవేక్షణ లేకపోవడాన్ని పసిగట్టి తరచూ దొంగతనాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.
జాతీయ రహదరి 44 పై మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల బస్టాండ్ అంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. ఇటీవల జరిగిన వరుస చోరీలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. బస్సు జడ్చర్ల బస్టాండ్ కు సమీపంలో ఉండగానే అంతా భద్రంగా సర్దేసుకోవాల్సిన పరిస్థితి ఎదురువుతోంది. అహారం కోసమో, టీ కోసమే, కాలకృత్యాల కోసమో దిగుతున్నామా వెంట తెచ్చుకున్న వస్తువులపై గట్టి నిఘా ఉంచాల్సిందే. ఏ మాత్రం ఏమరపాటు ఉన్న ఇట్టే కళ్లుగప్పి ప్రయాణికుల బ్యాగులను గుళ్ల చేస్తున్నారు దొంగలు.
వరుస దొంగతనాలు..
ఇటీవల వరుస చోరీలకు జడ్చర్ల బస్టాండ్ ను కేంద్రంగా చేసుకున్నారు దొంగలు. ఆంధ్రప్రదేశ్ లోని తణుకు కు చెందిన మత్తె భానుచంద్ర అక్టోబర్ నెల 23వ తేదిన పెబ్బెరు నుంచి హైదారాబాద్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. మార్గమధ్యలో మధ్యాహ్నం భోజనం కోసం డ్రైవర్ జడ్చర్ల బస్టాండ్ లో బస్సును నిలిపాడు. అయితే బాధితుడు నీళ్లు, స్నాక్స్ కోసం బస్సు దిగి వెళ్లాడు. తిరిగి పది నిమిషాల్లో బస్సు ఎక్కి వస్తువులు చూసుకోగా భానుచంద్ర ల్యాప్ టాప్, క్రెడిట్ కార్డులు, కంపనీకి చెందిన కొన్ని డాక్యుమెంట్ల్, వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు.
ఇక ఘటన జరిగిన కొద్దిరోజుల వ్యవధిలోనే మరో రెండు ఘటనలు కలకలం రేపాయి. అక్టోబర్ నెల 28వ తేదిన జనగాం జిల్లా కేంద్రానికి చెందిన కాసం అంజనేయులు దంపతులు కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్లెందుకు ఉదయం ఆర్టీసీ బస్సు ఎక్కారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భోజనం కోసం డ్రైవర్ బస్సును జడ్చర్ల బస్టాండ్ లో నిలిపాడు. దీంతో అంజనేయులు దంపతులు ఇద్దరూ భోజనం కోసం దిగి మళ్లీ బస్సు ఎక్కారు. వచ్చి చూడగానే ఇద్దరికి షాక్ తగిలింది. తమ సీట్లలో పెట్టిన బ్యాగులు కనిపించలేదు. దీంతో కంగారు పడిన ఇరువురు బస్సు మొత్తం వెతికిన ఎక్కడా సొత్తు లభించలేదు. అనంతరం తమ బ్యాగులు చోరి అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 9తులాల బంగారం, కొంత నగదును దొంగలు ఎత్తికెళ్లినట్లు బాధితులు తెలిపారు.
ఇక ఇదిలా ఉండగా రెండు రోజుల వ్యవధిలోనే మళ్లీ దొంగలు పంజా విసిరారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలానికి చెందిన గడ్డపార పావని రూ.3,69.500లు పోగొట్టుకుంది. పొలం అమ్మగా వచ్చిన నగదుతో తన తమ్ముళ్ల దగ్గరికి హైదరాబాద్ వెళ్లెందుకు తిమ్మాజీపేటలో బస్సు ఎక్కారు. ఆ బస్సు సైతం జడ్చర్ల బస్టాండ్ లో భోజన విరామం కోసం నిలిపారు. అయితే నగదు ఉన్న బ్యాగును వారి సీట్లలో పెట్టి వెళ్లారు. తీరా కొద్దిసేపటికే బ్యాగులో ఉన్న నగదును దుండగులు చోరి చేశారు. దీంతో ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రయాణీకుల అప్రమత్తతే ముఖ్యం
జడ్చర్ల బస్టాండ్ లో బస్సుల్లో వరుస చోరీలు ప్రయాణికులను బెంబెలెత్తిస్తున్నాయి. ఈ జాతీయ రహదారి మీదుగా కర్ణాటకలోని బెంగళూరు, ఏపీలోని కర్నూలుకు వెళ్లేవారు ఎక్కువగా ప్రయాణాలు సాగిస్తుంటారు. వచ్చే అప్పుడైనా… వెళ్లెప్పుడైనా జడ్చర్ల మార్గ మధ్యలో ఉండడంతో దొంగలు బస్టాండ్ ను చోరీలకు కేరాఫ్ అడ్రస్ గా మలుచుకున్నారు. అయితే చోరీ కేసులను వెంటనే ఛేదిస్తున్నప్పటికీ వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. దీంతో బస్ స్టాండ్ పరిధిలో పోలీసులతో ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేశారు. ఈ వరుస చోరీలకు అటూ ప్రయాణికుల అజాగ్రత్త, ఇటు పోలీసుల నిఘా కొరవడిందని విమర్శలు వస్తున్నాయి. నగదు, బంగారు ఆభరణాలతో వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..