Inter Exam Pattern Chenged: ఇంటర్ బోర్డు పైత్యం.. పరీక్షలకు ముందు ఇంటర్‌ ప్రశ్నపత్రంలో మార్పా?

Inter Exam Pattern Chenged: ఇంటర్ బోర్డు పైత్యం.. పరీక్షలకు ముందు ఇంటర్‌ ప్రశ్నపత్రంలో మార్పా?


హైదరాబాద్, జనవరి 29: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 15 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యార్ధులు ముమ్మరంగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యా సంవత్సరం దాదాపు ముగింపుకు వచ్చిన తర్వాత ఇంటర్‌ బోర్డు వింత ప్రకటన చేసింది. పరీక్ష ప్రశ్నపత్రాలకు సంబంధించి కీలక మార్పు చేయనున్నట్లు వెల్లడించింది. సాధారణంగా ఇంటర్‌ సిలబస్‌, పరీక్ష విధానం లాంటి విషయాల్లో ఎలాంటి మార్పు చేసినా.. అది విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చేయాలి. దానిపై విద్యార్థులకు మొదటి నుంచే అవగాహన కల్పించి సంసిద్ధంగా ఉంచాలి. లేనిపక్షంలో లక్షల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడటమేకాకుండా వారిలో అనవసరంగా గందరోళం నెలకొంటుంది. కానీ ఇంటర్‌ బోర్డు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది.

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు కేవలం నెలన్నర ముందు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఆంగ్లం సబ్జెక్టు ప్రశ్నపత్రాల నమూనాలో మార్పు చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆ సబ్జెక్టులో మూడు సెక్షన్లలో 16 ప్రశ్నలు ఉండేవి. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలో ఒక ప్రశ్నను అదనంగా చేర్చుతున్నట్లు ప్రకటించింది. దీనిని ఛాయిస్‌గా ఇచ్చారా.. అంటే అదీ లేదు. సాధారణంగా సెక్షన్‌-సిలో ఒక ప్రశ్నకు 8 మార్కులు, మిగిలిన ప్రశ్నలకు నాలుగేసి మార్కుల చొప్పున ఉండేవి. అయితే తాజాగా ఆ సెక్షన్‌లోని 8 మార్కుల ప్రశ్నను 4కి తగ్గించి… కొత్తగా కలిపిన ప్రశ్నకు ఆ 4 మార్కులు కేటాయించారు. దాన్ని మ్యాచ్‌ ది ఫాలోయింగ్‌ తరహా ప్రశ్నగా మార్చి ఇవ్వనున్నారు. పైగా ఈ జత పరిచే విధానం కూడా 10 ఇస్తే 8కి మ్యాచ్‌ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కోదానికి అర మార్కు కేటాయిస్తారన్నమాట.

ఇంటర్‌ విద్యార్థులు ఇప్పటికే పరీక్షల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొత్తగా పరీక్షలకు ముందు ఇలా ప్రశ్నపత్రాల విధానంలో మార్పు చేస్తే ఎలా అని ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు అన్ని జూనియర్‌ కాలేజీల్లో విద్యార్ధులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇక ప్రభుత్వ కళాశాలల్లోనైతే విద్యార్థులు సగం మంది మాత్రమే తరగతులకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఈ మార్పును గురించి ఎలా చెప్పాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలకు ముందు ఇలాంటివి చేసి, విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్నారంటూ తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పెద్దలు దీనిపై దృష్టి సారించి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *